V Srinivas Goud: తెలంగాణలో కొత్త లిక్కర్ పాలసీ చుట్టూ రాజకీయ వేడి రాజుకుంటోంది. ఈ అంశంపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మద్యం దుకాణాల దరఖాస్తు ధరలు పెంచడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని ఆయన ఆరోపించారు.
మద్యం షాపు దరఖాస్తు ధరలు పెంచే కుట్ర?
ప్రస్తుతం మద్యం షాపు దరఖాస్తు ధర రెండు లక్షల రూపాయలు ఉంది. అయితే, ఈ ధరను ఏకంగా మూడు లక్షల రూపాయలకు పెంచాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. అంతేకాదు, ప్రస్తుత లిక్కర్ పాలసీ గడువు ముగియకముందే కొత్త షాపుల దరఖాస్తులను ఆహ్వానించేందుకు సిద్ధమవుతున్నారని ఆయన అన్నారు. ఇదంతా మద్యం వ్యాపారులకు లబ్ధి చేకూర్చేందుకే అని ఆయన విమర్శించారు.
గ్రామాలు పల్లెలు తేడా లేకుండా మద్యం షాపులు – కల్లు దుకాణాలపై కన్నేశారా?
శ్రీనివాస్ గౌడ్ చేసిన మరో కీలక ఆరోపణ ఏమిటంటే, రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో మద్యం షాపులు తెరిచేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని. దీని ద్వారా మద్యం మాఫియాను పెంచి పోషించి, పేదల జీవనాధారమైన కల్లు దుకాణాలను మూసివేసే కుట్ర జరుగుతోందని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్లు దుకాణాలు మూతపడితే వేలాది మంది గీత కార్మికులు రోడ్డున పడతారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

