Srinivas goud: తెలంగాణ బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్సు అంశంలో బీఆర్ఎస్ పార్టీకి అవగాహన లేదంటూ కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్‌లోకి వెళ్లిన తర్వాత కేశవరావు మాట్లాడుతున్న తీరు అర్థం కావడం లేదని విమర్శించారు.
తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు వ్యాఖ్యలపై గౌడ్ ఘాటుగా స్పందిస్తూ, “కేశవరావు గారు బీఆర్ఎస్ నేతలపై కాకుండా కాంగ్రెస్ నాయకులపై విమర్శలు చేయాలి. కానీ అది చేయలేకపోయి తప్పుడు విమర్శలు చేస్తున్నారు” అని ఎద్దేవా చేశారు.
రిజర్వేషన్లకు ఆర్డినెన్సు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్న
విద్య, ఉద్యోగాల్లో బీసీలకు రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం ఆర్డినెన్సు ఇవ్వకపోవడాన్ని గౌడ్ ప్రశ్నించారు. “బీఆర్ఎస్ మొదటి నుంచి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలును డిమాండ్ చేస్తోంది. ఎలాంటి చట్టపరమైన అడ్డంకులు లేకుండా వెంటనే అమలు చేయాలి” అని అన్నారు.
కేశవరావు ప్రభుత్వానికి సహకరించాలని చెబుతున్న విషయంపై మాట్లాడుతూ, “తప్పు చేస్తుంటే సహకరించాలా? ప్రజా ప్రయోజనాల కోసం నిలబడాలి కానీ, రాజకీయంగా సవ్యంగా కాకపోతే ప్రశ్నించక తప్పదు” అని గౌడ్ పేర్కొన్నారు.