Srilanka: శ్రీలంక రాజకీయాల్లో శుక్రవారం సంచలన పరిణామం చోటుచేసుకుంది. దేశ మాజీ అధ్యక్షుడు, ఆరుసార్లు ప్రధానిగా పనిచేసిన రణిల్ విక్రమసింఘేను పోలీసులు అరెస్ట్ చేశారు. అధ్యక్షుడిగా ఉన్న సమయంలో వ్యక్తిగత విదేశీ పర్యటన కోసం ప్రభుత్వ నిధులను వినియోగించారన్న ఆరోపణలపై ఈ చర్య తీసుకున్నారు.
ఏం జరిగింది?
వివరాల్లోకి వెళితే, 2023 సెప్టెంబర్‌లో విక్రమసింఘే లండన్ పర్యటనకు వెళ్లారు. ఈ ప్రయాణం పూర్తిగా వ్యక్తిగతమని ఆయన చెప్పినా, దానికి కావాల్సిన ఖర్చులను ప్రభుత్వ నిధుల నుంచి చెల్లించారని ఆరోపణలు ఎదురవుతున్నాయి. ఆ సమయంలో ఆయన భార్యతో కలిసి ఒక విశ్వవిద్యాలయం గ్రాడ్యుయేషన్ వేడుకకు హాజరయ్యారు. అధికారికంగా ఈ పర్యటన జరగలేదని ఆయన తర్వాత ప్రకటించారు.
అయితే, ఈ ప్రయాణంలో అంగరక్షకుల ఖర్చులు సహా ప్రభుత్వ నిధులు వాడారని విచారణ అధికారులు చెబుతున్నారు. విక్రమసింఘే మాత్రం భార్య ఖర్చులను ఆమె భరించిందని, ప్రభుత్వ సొమ్ము వినియోగించలేదని వాదిస్తున్నారు.
విచారణ, అరెస్ట్
ఈ కేసులో భాగంగా శ్రీలంక నేర పరిశోధన విభాగం (సీఐడీ) అధికారులు శుక్రవారం ఉదయం విక్రమసింఘేను విచారించారు. విచారణ అనంతరం ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్లు ఒక ఉన్నతాధికారి తెలిపారు. అరెస్టైన విక్రమసింఘేను కొలంబో ఫోర్ట్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నట్లు సమాచారం.
ప్రధాన నేపథ్యం
2022 జూలైలో గొటబాయ రాజపక్స రాజీనామా చేసిన తర్వాత రణిల్ విక్రమసింఘే అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అప్పట్లో శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ఇప్పుడు ఆయన అవినీతి ఆరోపణలపై అరెస్ట్ కావడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.