Crime News: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చెందిన యువకుడు శ్రీనివాసులు అలియాస్ రాయుడు చెన్నైలో దారుణ హత్యకు గురైన విషయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. చెన్నైలోని కూవం నదిలో మూడు రోజుల క్రితం గుర్తు తెలియని మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. విచారణలో అది శ్రీనివాసులుది అని తేలింది.
ఈ కేసులో విచారణ చేపట్టిన తమిళనాడు సెవెన్ వెల్స్ పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు. నిందితుల్లో శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇంఛార్జి వినుత కోటా, ఆమె భర్త చంద్రబాబు కూడా ఉన్నారు. వీరిచేత రాయుడిని చిత్రహింసలకు గురిచేసి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. హత్య అనంతరం చెన్నైలోని ఎంఎస్ నగర్ హౌసింగ్ బోర్డు వెనక ఉన్న ప్రాంతంలో, కూవం నదిలో రాయుడి మృతదేహాన్ని పడేసినట్లు తెలుస్తోంది.
పాత పరిచయం.. ప్రస్తుత శత్రుత్వం?
రాయుడు గతంలో వినుతకు వ్యక్తిగత సహాయకుడిగా (పీఏ) మరియు డ్రైవర్‌గా పనిచేశాడు. కానీ రెండు వారాల క్రితం, అర్ధం కాని కారణాలతో వినుత అతన్ని విధుల నుంచి తొలగించినట్లు సమాచారం. జూన్ 21వ తేదీన వినుత బహిరంగంగా ప్రకటన చేస్తూ – “ఇకపై శ్రీనివాసులతో ఎలాంటి సంబంధం లేదు” అని చెప్పారు. అప్పటి నుంచే ఈ వ్యవహారం అనుమానాస్పదంగా మారింది.
ఇది కూడా చదవండి: Srikalahasti: డబ్బులు పంపితే దోషం పోగొడతాం!.. శ్రీకాళహస్తిలో బరితెగించిన పూజారులు!
హత్య వెనుక అసలు కారణం ఏమిటి?
పోలీసులు ప్రస్తుతం ఈ కేసును వివిధ కోణాల్లో విచారిస్తున్నారు. రాయుడిపై ఎందుకు ఈ స్థాయిలో కక్ష పెట్టారు? నిజంగానే అతను ఏమైనా ద్రోహం చేశాడా? లేదా ఇంకేదైనా రాజకీయ లేదా వ్యక్తిగత అప్రయోజనమా? అన్న అంశాలపై విచారణ కొనసాగుతోంది.
ఇప్పటికే నిందితులను శ్రీకాళహస్తికి తీసుకొచ్చి అక్కడే గాఢంగా విచారణ జరుగుతోంది. కేసు పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. కానీ రాజకీయ పార్టీలో బాధ్యత వహించే వ్యక్తులు ఇలాంటి ఘటనలో ఉండటంతో ఈ ఘటనపై మరింత గమనించాల్సిన అవసరం ఉంది.

