Sridhar Babu: తెలంగాణ శాసనసభ వేదికగా ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై అధికార, ప్రతిపక్షాల మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది. మాజీ మంత్రి హరీశ్‌రావు అసెంబ్లీలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన బకాయిలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రస్తుతం ఉద్యోగులకు సంబంధించి మొత్తం ఆరు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ బకాయిలను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
అంతేకాకుండా, రిటైర్డ్ ఉద్యోగుల పరిస్థితిపై కూడా హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు రావాల్సిన పింఛన్ బకాయిలు అందక ఆర్థిక ఇబ్బందులతో ఇప్పటివరకు సుమారు 39 మంది విశ్రాంత ఉద్యోగులు మరణించారని ఆయన సభ దృష్టికి తీసుకెళ్లారు. ఉద్యోగుల సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వం పాత బకాయిలన్నింటినీ వెంటనే చెల్లించాలని ఆయన కోరారు.
హరీశ్‌రావు వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్ బాబు ఘాటుగా స్పందించారు. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల సమస్యలను పట్టించుకోని వారు, ఇప్పుడు వారి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. హరీశ్‌రావు మాటలు వింటుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని మంత్రి ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం వదిలేసిన సమస్యలను తాము పరిష్కరిస్తున్నామని చెప్తూనే.. సభలో సభ్యులు చేసిన విజ్ఞప్తులను ప్రభుత్వం తప్పకుండా పరిగణనలోకి తీసుకుంటుందని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.
