Sridhar babu:: హైదరాబాద్‌లో హైటెక్ సిటీ తరహాలో మరో రెండు ఐటీ పార్కులను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. సచివాలయంలో ‘డ్యూ’ సాఫ్ట్‌వేర్ కంపెనీ ప్రతినిధులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ కంపెనీ రూ.100 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చినట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ, హైదరాబాద్ ఐటీ రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. దేశ విదేశాల ప్రముఖ ఐటీ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయని చెప్పారు.
హైటెక్ సిటీ తరహాలో కొత్తగా ఏర్పాటయ్యే రెండు ఐటీ పార్కుల స్థాపనకు అనువైన ప్రాంతాలను గుర్తించేందుకు అధ్యయనం జరుగుతోందని ఆయన తెలిపారు. నగర శివార్లలో అనుకూల ప్రాంతాలను ఎంపిక చేసి, ఐటీ పార్కులను అన్ని మౌలిక సదుపాయాలతో తీర్చిదిద్దుతామని తెలిపారు. ఉద్యోగులు ఎక్కడి నుంచైనా సులభంగా చేరుకునేలా రవాణా సదుపాయాలు కల్పిస్తామన్నారు.
ఐటీ పార్కుల్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే కంపెనీలకు అవసరమైన అవకాశాలు అందిస్తామని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. భూకేటాయింపుల విషయంలో ఇప్పటి వరకు ప్రత్యేక పాలసీ లేకపోవడంతో పారిశ్రామికవేత్తలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. దీనికి పరిష్కారంగా, పెట్టుబడుల పరిమాణం, ఉద్యోగాల సంఖ్య ఆధారంగా భూమి కేటాయింపులు చేసే ప్రత్యేక పాలసీని త్వరలో తీసుకురాబోతున్నామని ఆయన పేర్కొన్నారు.