Sridhar Babu: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ (హెచ్‌సీయూ) భూమిపై నెలకొన్న వివాదానికి సుప్రీంకోర్టు తుది చుక్క పెట్టింది. ఈ భూమి తెలంగాణ ప్రభుత్వానిదే అని తేల్చిచెప్పింది. దీనిపై స్పందించిన రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబు, సత్యం తేలిపోయిందని పేర్కొన్నారు.
అయితే, ఈ వ్యవహారాన్ని వక్రీకరించేందుకు కొందరు సోషల్ మీడియాలో దుష్ప్రచారానికి తెగబడుతున్నారని ఆయన ఆరోపించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీని ఉపయోగించి తప్పుడు చిత్రాలు, వీడియోలు సృష్టించి ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం చేశారు.
‘‘తొమ్మిదేళ్ల క్రితం రాజస్థాన్‌లో చనిపోయిన ఓ జింక ఫోటోను ఇప్పుడు హెచ్‌సీయూలో జరిగిన సంఘటనగా చూపిస్తూ వైరల్ చేశారు. ఇది పూర్తిగా నిరాధారమైనది, కావాలనే ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం,’’ అని మంత్రి అన్నారు.
ప్రజలు సోషల్ మీడియాలో వచ్చే వార్తలు, ఫోటోలు, వీడియోలను విశ్వసించే ముందు తగిన సమాచారం సేకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వంపై విమర్శలు చేయడం ఓ విషయం అయితే, తప్పుడు సమాచారంతో దుష్ప్రచారం చేయడం తగదని స్పష్టం చేశారు.