Sri Srinivasa Mahotsavam

Sri Srinivasa Mahotsavam: కలియుగ వైకుంఠ వైభవం.. వేలాది మందితో శ్రీవారి కల్యాణం.. దద్దరిల్లిన గచ్చిబౌలి స్టేడియం

Sri Srinivasa Mahotsavam: తిరుమల కొండపై వెలసిన శ్రీ వేంకటేశ్వరస్వామివారి దివ్య కల్యాణ వైభవం హైదరాబాద్ నగరానికి తరలివచ్చింది. మహా గ్రూప్ ఆఫ్ ఛానెల్స్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) మారెళ్ల వంశీకృష్ణ సంకల్పం, టీటీడీ సహకారంతో గచ్చిబౌలి స్టేడియం ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోయింది. శ్రీవారి జన్మ నక్షత్రమైన శ్రవణం పురస్కరించుకుని, శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి కల్యాణ మహోత్సవంను అంగరంగ వైభవంగా నిర్వహించారు. తిరుమలకు వెళ్లలేని భక్తులకు కలియుగ వైకుంఠ దర్శన భాగ్యాన్ని కల్పించడమే ఈ చారిత్రాత్మక కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.

కల్యాణం కోసం వేదికను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఏకంగా తిరుమల ఆలయాన్ని తలపించేలా శ్రీవారి నమూనా ఆలయాన్ని ఆరు అడుగుల ఎత్తులో నిర్మించారు. 120 అడుగుల పొడవు, 68 అడుగుల వెడల్పుతో కూడిన ఈ భారీ వేదికపై శ్రీ శ్రీనివాసుడు తన దేవేరులతో కలిసి కొలువుదీరారు. స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణం రోజునే ఈ దివ్య కల్యాణం జరగడం అత్యంత విశేషం. టీటీడీ అర్చకులు, పండితులు వేద పారాయణంతో శాస్త్రోక్తంగా కల్యాణాన్ని నిర్వహించి భక్త జనాన్ని పునీతం చేశారు.

ఈ మహాద్భుత వేడుకకు తెలుగు రాష్ట్రాల నుండి వేలాది మంది భక్త జనం తరలివచ్చారు. వేలాది మంది భక్తుల నోటి నుండి వెలువడిన ‘గోవింద’ నామస్మరణతో గచ్చిబౌలి ప్రాంగణం మార్మోగింది. ఈ కల్యాణ దర్శనం వల్ల సకల శుభాలు, ఐశ్వర్య ప్రాప్తి కలుగుతాయని, అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. కల్యాణం అనంతరం భక్తులకు తిరుమల ప్రసాదం పంపిణీ చేశారు.

ఈ చారిత్రాత్మక వేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. కేంద్ర మంత్రులు బండి సంజయ్, పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, చిలుకూరు బాలాజీ ప్రధానార్చకులు రంగరాజన్, నటుడు రాజేంద్రప్రసాద్‌ తదితరులు విచ్చేసి స్వామివారి కల్యాణాన్ని వీక్షించి తరించారు. ఈ కల్యాణ మహోత్సవం హైదరాబాద్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని నిర్వాహకులు పేర్కొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *