Sri Rama Navami Special: లోక కల్యాణం కోసం మానవ రూపంలో అవతరించిన సాక్షాత్తు ఆ శ్రీమహావిష్ణువు అవతారమే శ్రీరామచంద్రుడు. చైత్ర శుద్ధ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ రోజే రామయ్య జన్మించడంతో పాటు, సీతారాముల కల్యాణం కూడా జరగడం విశేషం. అయోధ్యలో జన్మించిన రాముడు, మిథిలా నగరంలో శివధనుస్సును విరిచి జానకిని పరిణయమాడిన ఘట్టాన్ని భక్తులు ఈ రోజు స్మరించుకుంటూ, ఆలయాల్లో కల్యాణోత్సవాలను కన్నుల పండువగా నిర్వహిస్తున్నారు.
అభిజిత్ లగ్నంలో రాముడి జననం
త్రేతాయుగంలో దశరథ మహారాజు, కౌసల్యా దేవి దంపతులకు పుత్రకామేష్టి యాగ ఫలంగా శ్రీరాముడు జన్మించారు. చైత్ర శుద్ధ నవమి రోజున, పునర్వసు నక్షత్రం, కర్కాటక లగ్నంలో సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు (అభిజిత్ లగ్నం) ఆయన జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఆధునిక జ్యోతిష్య గణాంకాల ప్రకారం రాముడు క్రీస్తు పూర్వం 5114 సంవత్సరంలో జన్మించినట్లు అంచనా. చిన్నతనంలోనే విశ్వామిత్ర మహర్షి వెంట వెళ్లి యాగ సంరక్షణ చేసి, తాటక వంటి రాక్షసులను సంహరించి తన పరాక్రమాన్ని చాటారు.
శివధనుర్బంగం – సీతా స్వయంవరం
విశ్వామిత్రునితో కలిసి మిథిలా నగరం చేరుకున్న రామలక్ష్మణులు అక్కడ జనక మహారాజు ఏర్పాటు చేసిన స్వయంవరంలో పాల్గొన్నారు. చిన్నతనంలోనే సీతాదేవి శివధనుస్సును అలవోకగా పక్కకు జరపడం చూసిన జనకుడు, ఆ ధనుస్సును ఎక్కుపెట్టిన వీరుడికే తన కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తానని ప్రకటించారు. లోకంలోని వీరులందరూ విఫలమైన చోట, శ్రీరాముడు విశ్వామిత్రుని ఆజ్ఞతో శివధనుస్సును ఎక్కుపెట్టి, దానిని విరిచి సీతాదేవి మనసు గెలుచుకున్నారు.
విశ్వమంతా పండగే.. సీతారాముల కల్యాణం
జనక మహారాజు ఆహ్వానం మేరకు దశరథుడు మిథిలకు చేరుకోగా, సీతారాముల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఆకాశం నుండి దేవతలు పుష్పవృష్టి కురిపించగా, గంధర్వుల గానల నడుమ ఈ వేడుక సాగింది. అందుకే ప్రతి ఏటా శ్రీరామనవమి నాడు భద్రాచలం, అయోధ్య వంటి పుణ్యక్షేత్రాలలోనే కాకుండా ప్రతి గల్లీలోనూ రాములోరి కల్యాణాన్ని జరిపి భక్తులు తరిస్తారు. రాముడి జీవితం మానవాళికి ఆదర్శం. ఒక కుమారుడిగా, భర్తగా, రాజుగా ఆయన చూపిన ధర్మ మార్గం నేటికీ ఆచరణీయం.
