Mauni Amavasya: హిందూ సంప్రదాయంలో పుష్య బహుళ అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీనినే ‘మౌని అమావాస్య’ లేదా ‘చొల్లంగి అమావాస్య’ అని పిలుస్తారు. ఈ రోజున మౌన వ్రతాన్ని పాటించడం వల్ల వాక్కు శుద్ధి అవడమే కాకుండా, మానసిక ప్రశాంతత లభిస్తుందని భక్తుల నమ్మకం. మౌనం అనేది మనిషిని అంతర్ముఖుడిని చేసి, ఆత్మచింతన వైపు నడిపిస్తుందని ఆదిశంకరాచార్యులు, రమణ మహర్షి వంటి గొప్ప జ్ఞానులు కూడా బోధించారు. కేవలం మాటలు నియంత్రించడమే కాకుండా, మనసును భగవంతునిపై కేంద్రీకరించడమే ఈ రోజు ప్రధాన ఉద్దేశ్యం.
ఈ ఏడాది జనవరి 18, 2026 న వచ్చిన ఈ అమావాస్య తిథికి మరిన్ని విశేషాలు తోడయ్యాయి. సర్వార్థ సిద్ధి యోగం, హర్షణ యోగం వంటి శుభ ఘడియలతో పాటు పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాల కలయిక ఉండటంతో ఈ పర్వదినం మరింత శక్తివంతంగా మారింది. ఈ రోజున బ్రహ్మ ముహూర్తంలో (ఉదయం 05:27 నుండి 06:21 వరకు) చేసే స్నానానికి విశేష ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఒకవేళ నదులకు వెళ్లలేని వారు ఇంట్లోనే స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగాజలాన్ని కలుపుకుని స్నానం చేస్తే గంగా స్నానం చేసినంత పుణ్యం లభిస్తుందని పురాణాలు వివరిస్తున్నాయి.
Also Read: Chanakya Niti: జీవితంలో తిరుగులేని విజయం మీ సొంతం కావాలా..? ఈ 5 సూత్రాలు పాటించండి!
మౌని అమావాస్య రోజున పితృ దేవతలకు తర్పణాలు వదలడం వల్ల పితృ దోషాలు తొలగి కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించి, పేదలకు అన్నం, వస్త్రాలు, దుప్పట్లు వంటివి దానం చేయడం ఈ రోజున అత్యంత శుభప్రదం. సాయంత్రం వేళ ఇంటికి దక్షిణ దిశలో దీపం వెలిగించడం ద్వారా పితృ దేవతలకు దారి చూపినట్లు అవుతుందని భక్తుల విశ్వాసం. మన రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా చొల్లంగి వద్ద గోదావరి సముద్రంలో కలిసే చోట కూడా భక్తులు పెద్ద ఎత్తున స్నానాలు చేసి పితృ కార్యాలు నిర్వహిస్తారు. అలాగే సింహాచల క్షేత్రంలో వరాహ లక్ష్మీనరసింహ స్వామికి తెప్పతిరునాళ్ల వేడుకలను అత్యంత వేడుకగా నిర్వహిస్తారు.
ఉత్తరాది రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడుతోంది. అత్యంత పవిత్రమైన ‘మౌని అమావాస్య’ పర్వదినాన్ని పురస్కరించుకుని గంగానది తీరాలు భక్తులతో పోటెత్తాయి. ముఖ్యంగా ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాలు ఆచరించేందుకు దేశం నలుమూలల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికే సుమారు 75 లక్షల మంది భక్తులు పవిత్ర స్నానాలు పూర్తి చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బిహార్ వంటి రాష్ట్రాల్లోని ప్రధాన నదీ ఘాట్ల వద్ద ఈ రోజు సాయంత్రానికి సుమారు 3.5 కోట్ల మంది భక్తులు స్నానాలు చేస్తారని ఒక అంచనా.
