తొలి ట్వంటీ20లో కీలక స్పెల్స్ వేసిన టీమిండియా బౌలర్లలో కేకేఆర్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఒకరు. మయాంక్ తన స్పీడ్ తో అందరి దృష్టిని ఆకర్షించి ఉండొంచ్చు, అర్షదీప్ బంగ్లాపై ఎటాక్ చేసి 3 వికెట్లతో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కించుకుని ఉండవచ్చు. హార్దిక్ తన విధ్వంసక ఆటతీరుతో బంగ్లా బ్యాటర్లను సోదిలోకి లేకుండా చేసుండవచ్చు. కానీ, తొలి ట్వంటీ20లో 3 వికెట్లు తీసిన వరుణ్ కంట్రిబ్యూషన్ వెలకట్టలేనిది. ఓ రకంగా అతనికిది సంజీవని లాంటిది.
31 పరుగులకు 3 వికెట్లు మరీ అంత ఇంప్రెస్సివ్వేమీ కాకపోవచ్చు. మూడేళ్లుగా జట్టుకు దూరమైన ప్లేయర్ కు ఇది గొప్ప ఊరటనిచ్చే అంశమే. వరుణ్ చివరిసారిగా 2021 నవంబర్లో టీమిండియాకు ఆడాడు. ఈ మధ్యలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాడు. తనను తాను ఉత్తేజపరచుకుంటూ ఐపీఎల్లో కోల్కతకు చిరస్మరణీయ విజయాలు అందించాడు. కేకేఆర్ ఈ ఏడాది ఐపీఎల్ కప్ కొట్టడంలో కీలక పాత్ర అతనిదే. ఆ జట్టు తరఫున అత్యధిక వికెట్లు తీసింది వరుణే. ఓవరాల్గా 2024 ఐపీఎల్ ఎడిషన్లో అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. 14 ఇన్నింగ్స్ లలో 21 వికెట్లు పడగొట్టాడు.
ఐపీఎల్ మే లో ముగిసింది. కానీ వరుణ్ మాత్రం ఆగిపోలేదు. తమిళనాడు ప్రిమియర్ లీగ్ లో దిండిగల్ డ్రాగన్స్ తరపున బరిలోకి దిగి జట్టు టైటిల్ సాధనలో కీలకపాత్ర పోషించాడు. అశ్విన్ కెప్టెన్సీలో వరుణ్ .. ఫైనల్లో 26 పరుగులకు 2 వికెట్లు తీశాడు. సందీప్ వారియర్ తో సంయుక్తంగా 12 వికెట్లతో టోర్నీలో హైయస్ట్ వికెట్ టేకర్ గా నిలిచాడు. ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్లో పునరాగమనం చేసిన తొలి మ్యాచ్ లోనే 3 వికెట్లతో మెరిశాడు. అందుకే వరుణ్ చక్రవర్తి బంగ్లాతో జరిగిన తొలి ట్వంటీ20 మ్యాచ్ తర్వాత తనకిది పునర్జన్మ అంటూ ఎమోషనల్ అయ్యాడు.