Aadhaar Camps

Aadhaar Camps: ఏపీలో నేటి నుంచి స్కూళ్లలో ఆధార్‌ స్పెషల్‌ క్యాంపులు.. ఎప్పటి వరకు అంటే..?

Aadhaar Camps: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం. విద్యార్థుల భవిష్యత్తు, సంక్షేమ పథకాల లబ్ధిని దృష్టిలో ఉంచుకొని ఐదేళ్ల నుంచి 15 ఏళ్ల వయసులోపు పిల్లల ఆధార్ బయోమెట్రిక్ వివరాలను అప్‌డేట్ చేసుకునేందుకు వీలుగా, రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులను ఏర్పాటు చేసింది.
ఉచిత అప్‌డేట్‌కు నేటి నుంచి అవకాశం

ఏపీ విద్యాశాఖ, యూఐడీఏఐ (UIDAI), గ్రామ/వార్డు సచివాలయాల శాఖ సమన్వయంతో ఈ ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నారు. నవంబర్ 17వ తేదీ (నేటి) నుంచి నవంబర్ 26వ తేదీ వరకు, అంటే పది రోజుల పాటు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. 5 ఏళ్ల నుంచి 15 ఏళ్ల వయసులోపు పిల్లలు. బయోమెట్రిక్‌ (వేలిముద్రలు, కనుపాప) వివరాల అప్‌డేట్ చేసుకోవొచ్చు. ఈ సేవ పూర్తిగా ఉచితం. విద్యార్థులు ఈ అవకాశాన్ని ఒకసారి మాత్రమే ఉపయోగించుకోగలరు.

15 లక్షల మందికి తప్పనిసరి

ఆధార్ జారీ సంస్థ (యూఐడీఏఐ) సమాచారం ప్రకారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికీ 15.46 లక్షల మందికి పైగా పిల్లలు తమ ఆధార్ కార్డులలో బయోమెట్రిక్ అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంది. పిల్లలు పెరిగే కొద్దీ వారి వేలిముద్రలు, కనుపాపల్లో మార్పులు వస్తాయి. ఈ నేపథ్యంలో, ఐదేళ్ల తర్వాత బయోమెట్రిక్‌ను అప్‌డేట్ చేసుకోవడం తప్పనిసరి.ఆధార్‌ అప్‌డేట్ చేయించుకోని కారణంగా సంక్షేమ పథకాల లబ్ధికి ఇబ్బందులు ఎదురవకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ చొరవ తీసుకుంది.

ఇది కూడా చదవండి: Sabarimala Ayyappa: శబరిమల పూజరిని ఎవరు నియమిస్తారు?

సంక్షేమ పథకాలకు ఆధార్ కీలకం

ప్రస్తుతం ఆధార్ కార్డు అనేది కేవలం గుర్తింపు పత్రం మాత్రమే కాదు, ప్రభుత్వాలు అందించే ప్రతి సంక్షేమ పథకానికి, పాఠశాల అడ్మిషన్లకు మూలాధారంగా మారింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి ముఖ్యమైన పథకాల లబ్ధి పొందడానికి విద్యార్థుల ఆధార్ కార్డు వివరాలు కచ్చితంగా అప్‌డేట్ అయి ఉండటం తప్పనిసరి.

పెరిగిన ఆధార్ సేవా రుసుములు

సాధారణంగా ఆధార్ అప్‌డేట్‌ సేవలకు రుసుములు పెరిగిన నేపథ్యంలో, పాఠశాలల్లో ఉచితంగా అందిస్తున్న ఈ క్యాంపుల సదుపాయాన్ని ఉపయోగించుకోవడం మరింత ముఖ్యం.

ఆధార్ సేవ పాత రుసుము కొత్త రుసుము (అక్టోబర్ 1 నుంచి)
పేరు, పుట్టిన తేదీ వంటి డెమోగ్రాఫిక్ మార్పులు ₹50 ₹75
సాధారణ బయోమెట్రిక్‌ అప్‌డేట్‌ ₹100 ₹125
డాక్యుమెంట్‌ అప్‌డేట్‌ ₹50 ₹75

గమనిక: పుట్టిన పిల్లలకు కొత్తగా ఆధార్ కార్డు తీసుకోవడం, అలాగే 5 ఏళ్ల నుంచి 17 సంవత్సరాల లోపువారు తమ బయోమెట్రిక్‌ వివరాలను అప్‌డేట్‌ చేసుకోవడం మాత్రం ఎప్పటికీ ఉచితం. కాబట్టి, తల్లిదండ్రులు తమ పిల్లలు తప్పనిసరిగా పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ఈ ఉచిత ప్రత్యేక ఆధార్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచిస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *