SA vs ENG: ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మొదటి వన్డేలో దక్షిణాఫ్రికా జట్టు 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దక్షిణాఫ్రికా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు తీవ్రంగా విఫలమైంది. తమ సొంత గడ్డపై ఆడుతున్నప్పటికీ, ఆ జట్టు కేవలం 24.3 ఓవర్లలో 131 పరుగులకే ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో జేమీ స్మిత్ ఒక్కడే 54 పరుగులతో రాణించాడు. మిగిలిన బ్యాటర్లు ఎవరూ పెద్దగా పరుగులు చేయలేకపోయారు, వారిలో ఆరుగురు సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. దక్షిణాఫ్రికా స్పిన్నర్లు కేశవ్ మహారాజ్ (4/22), వైయాన్ ముల్డర్ (3/33) అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్ ను కూల్చేశారు.
Also Read: Afghanistan vs Pakistan: పాకిస్తాన్‌ను ఓడించిన ఆఫ్ఘనిస్తాన్
దక్షిణాఫ్రికా కేవలం 20.5 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. ఓపెనర్ ఐడెన్ మార్క్రమ్ కేవలం 55 బంతుల్లో 86 పరుగులు చేసి మ్యాచ్ ను చాలా వేగంగా ముగించారు. అతని ఇన్నింగ్స్ లో 8 ఫోర్లు, 2 సిక్స్ లు ఉన్నాయి. ఈ మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును ఐడెన్ మార్క్రమ్ గెలుచుకున్నారు. ఆయన విధ్వంసకర బ్యాటింగ్‌తో జట్టుకు సునాయాస విజయాన్ని అందించారు. అయితే, కేశవ్ మహారాజ్ అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన కూడా ఈ విజయంలో కీలక పాత్ర పోషించింది.ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ తన జట్టు ప్రదర్శనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇది సరైన ప్రదర్శన కాదు. ఇది చూసేందుకు ఎవరూ ఇష్టపడరు అని అన్నాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఆటగాళ్ల ఆటతీరు పేలవంగా ఉందని ఆయన అంగీకరించాడు.

