Hyderabad: హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి, మాదాపూర్ పరిధిలో ఉన్న ప్రముఖ పబ్‌లపై శుక్రవారం రాత్రి పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఎస్‌వోటీ (Special Operations Team) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ తనిఖీలు నగరంలో పెరిగిపోతున్న డ్రగ్స్ వినియోగంపై సమగ్ర దృష్టితో చేపట్టిన చర్యగా పేర్కొంటున్నారు అధికారులు.
క్లబ్ రఫ్, ఫ్రూట్ హౌస్ టార్గెట్
పోలీసులు ఈ దాడుల్లో క్లబ్ రఫ్, ఫ్రూట్ హౌస్ వంటి ట్రెండింగ్ పబ్‌లను టార్గెట్ చేశారు. మాదాపూర్‌లోని ఎస్‌ఎల్‌ఎన్ టెర్మినల్ మాల్‌లో ఉన్న పబ్‌లో సైతం సోదాలు చేపట్టారు. ఈ సందర్భంగా పబ్‌లలో యువత మత్తులో మునిగిపోతున్న దృశ్యాలు పోలీసులకు ఎదురయ్యాయి.
డ్రగ్ టెస్టులో గంజాయి పాజిటివ్
తనిఖీల సమయంలో పబ్‌లో ఉన్న పలువురిపై డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. అందులో నలుగురు యువకులకు గంజాయి తీసుకున్నట్లు నిర్ధారణ కావడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో డీజే ప్లేయర్ శివకు కూడా డ్రగ్ టెస్టులో పాజిటివ్ రావడం పోలీసులను ఆశ్చర్యానికి గురిచేసింది.
ఇది కూడా చదవండి: APPSC JL 2025 Revised Dates: ఏపీ జూనియర్ లెక్చరర్ పరీక్ష తేదీలు వచ్చేశాయ్..
NDPS యాక్ట్ కింద కేసులు
ఈ ఘటనలపై మాదాపూర్ పోలీసులు NDPS యాక్ట్ కింద కేసులు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. నగరంలోని పబ్ కల్చర్‌పై ఈ దాడులు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. యువత మత్తుకు బానిసలవుతున్నారని, నగరంలో డ్రగ్స్ నెట్‌వర్క్‌ను పూర్తిగా చెక్ చేయాల్సిన అవసరం ఉందని పోలీసులు అంటున్నారు.
మొత్తంగా, హైదరాబాదీ యువత నైట్‌లైఫ్ వినోదం పేరుతో ప్రమాదకర దారుల్లోకి వెళ్లకుండా ఉండాలన్నది పోలీసుల సంకల్పంగా కనిపిస్తోంది. త్వరలోనే మరిన్ని పబ్‌లపై దాడులు జరిగే అవకాశముందని సమాచారం.