Sonia Gandhi: ఇరాన్‌పై ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న సైనిక దాడుల నేపథ్యంలో, భారత ప్రభుత్వం మౌనంగా ఉండటం విషాదకరమని కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ వ్యాఖ్యానించారు. ‘‘భారత్ తన స్వరాన్ని కోల్పోవడమే కాక, తాము తగిన విలువలను కూడా త్యాగం చేసినట్లు కనిపిస్తోంది,’’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రఖ్యాత ఆంగ్ల దినపత్రిక ది హిందూలో “ఇండియాకు తన స్వరాన్ని వినిపించేందుకు ఇంకా ఆలస్యం కాలేదు” అనే శీర్షికతో సోనియా గాంధీ రాసిన వ్యాసం ప్రచురితమైంది. అందులో పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ఆమె స్పందించారు.
గతంలో పాలస్తీనా-ఇజ్రాయెల్ మధ్య కుదిరిన ఒప్పందాన్ని అమలు చేయడంలో మోదీ సర్కారు విఫలమైందని ఆమె ఆరోపించారు. అంతేగాక, భారత్ తన అధికారిక వైఖరిని వెల్లడించడంలో ఆలస్యం చేస్తోందని పేర్కొన్నారు. ఇప్పటికైనా భారత్ బాధ్యతాయుతంగా వ్యవహరించి, పశ్చిమాసియాలో శాంతి స్థాపన కోసం దౌత్యపరమైన చర్చలకు శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉందని సూచించారు.
అలాగే, ఈ అంశంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరించిన విధ్వంసకర ధోరణిని ఆమె తీవ్రంగా ఖండించారు. శాంతికి అనుకూలంగా ఉండే ధృక్పథాన్ని భారత్ మెరుగ్గా ప్రదర్శించాలని సోనియా గాంధీ తన వ్యాసంలో విన్నవించారు.