Sonia Gandhi: కేంద్ర ప్రభుత్వం ఆరావళి పర్వతాలకు సంబంధించిన నూతన మార్పులను తీసుకువచ్చింది. వంద మీటర్ల కన్నా తక్కువ ఎత్తులో ఉన్న కొండ ప్రాంతాల్లో మైనింగ్ కార్యకలాపాలకు అనుమతులు ఇవ్వాలని ఈ సవరణల్లో పేర్కొనబడింది. ఈ మార్పుల వల్ల ఆరావళి పర్వత శ్రేణి సహజ స్వరూపం ప్రమాదంలో పడుతుందనే విమర్శలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరావళి పర్వతాల భౌగోళిక స్వరూపాన్ని మార్చేలా కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు ‘డెత్ వారెంట్’ లాంటివని ఆమె మండిపడ్డారు. ఇప్పటికే అక్రమ మైనింగ్ కారణంగా సహజ సంపద గణనీయంగా తగ్గిపోతోందని, ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలు పరిస్థితిని మరింతగా దిగజార్చే ప్రమాదం ఉందని తెలిపారు.
ఈ విషయాలన్నింటిపై ఆమె జాతీయ మీడియాకు రాసిన కథనంలో స్పష్టంగా వివరించారు. గుజరాత్, రాజస్థాన్, హర్యానా రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న ఆరావళి పర్వతాలు దేశ చరిత్ర, పర్యావరణ సమతుల్యతలో కీలకమైన పాత్ర పోషిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. మైనింగ్ అనుమతులు ఇచ్చి మైనింగ్ మాఫియాకే లాభం చేకూరుస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆమె ఆరోపించారు.
పర్యావరణ పరిరక్షణ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం ఇదేంటనే ప్రశ్నిస్తూ, ఇది వన్యప్రాణుల సంరక్షణ చట్టానికి కూడా వ్యతిరేకమని సోనియా గాంధీ హెచ్చరించారు. ఆరావళి ప్రాంతాన్ని కాపాడాలంటే ఈ నూతన విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.

