Crime News: వరంగల్ జిల్లా, సంగెం మండలం, కుంటపల్లి గ్రామంలో ఒక హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. కన్న కొడుకే తన తల్లిపై పెట్రోల్ పోసి నిప్పంటించగా, తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుది శ్వాస విడిచారు. ఈ దారుణం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
ఘటన వివరాలు:
ముత్తినేని వినోద (60), ఆమె కొడుకు సతీశ్‌ల మధ్య ఆస్తి తగాదాలు కొంత కాలంగా నడుస్తున్నట్లు తెలుస్తోంది. గ్రామంలో కాకతీయ వస్త్ర పరిశ్రమ భూ సేకరణలో భాగంగా వినోద దంపతులకు రూ.40 లక్షల పరిహారం వచ్చింది. ఇందులో సతీశ్‌కు రూ.30 లక్షలు ఇచ్చారు. మిగిలిన రూ.9 లక్షలను బ్యాంకులో డిపాజిట్ చేయగా, అందులో కొంత నగదును ఇచ్చి, మిగిలిన రూ.6 లక్షలను వినోద దంపతులు తమ పేరుపై ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసుకున్నారు.
ఈ డబ్బుల విషయంలోనే సతీశ్ తరచుగా తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. మూడు నెలల క్రితం కూడా డబ్బులు ఇవ్వకపోతే నిప్పు అంటిస్తానని బెదిరించాడు. ఆ సమయంలో పోలీసులు జోక్యం చేసుకుని సతీశ్‌ను తల్లిదండ్రులకు దూరంగా ఉండాలని సూచించారు. దీంతో సతీశ్ గీసుకొండ మండలం గంగదేవిపల్లిలో ఉంటున్నాడు.
అయితే, శుక్రవారం అర్ధరాత్రి, ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న తల్లి వినోదపై సతీశ్ పెట్రోల్ పోసి నిప్పంటించి అక్కడి నుంచి పారిపోయాడు. మంటలు అంటుకోగానే వినోద తీవ్రంగా గాయపడ్డారు. ఆమె కేకలు విన్న కుటుంబ సభ్యులు, స్థానికుల సహాయంతో మంటలను ఆర్పి, వెంటనే ఆమెను వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.
Also Read: Tirupati: తిరుపతిలో ఘోరం.. కారులో డెడ్ బాడీ
Crime News: వినోదకు 85 శాతం కాలిన గాయాలయ్యాయని వైద్యులు తెలిపారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని, గత మూడు రోజులుగా ఆమెకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. అయితే, మంగళవారం ఉదయం ఆమె చికిత్స పొందుతూ మృతి చెందారు.
తన కొడుకే తనపై దాడి చేశాడని వినోద మెజిస్ట్రేట్‌కు ఇచ్చిన వాంగ్మూలంలో స్పష్టంగా పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు సతీశ్‌ను అరెస్టు చేసి, ఈరోజు కోర్టులో హాజరుపరచనున్నారు. కన్న తల్లి పట్ల కొడుకు ఇంతటి దారుణానికి పాల్పడటం స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది.