Somireddy: జగన్ ఇంకా మారలేదు

Somireddy: టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో భారీ ఓటమి వచ్చినప్పటికీ జగన్ తన రాజకీయ తీరును మార్చుకోలేదని, ఇప్పటికీ పాత వ్యూహాలను కొనసాగిస్తూ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు.

సోమిరెడ్డి మాట్లాడుతూ, 2024 ఎన్నికల ముందు కూడా జగన్ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఫోటోలు, వీడియోలు పెట్టి, “సిద్ధం సిద్ధం” అంటూ హడావుడి చేశారని గుర్తుచేశారు. అప్పుడు కూడా జగన్ లక్షల మంది జనమన్నారు, “వై నాట్ 175” అన్నారు, కానీ చివరికి ఫలితాలు ఎలా వచ్చాయో రాష్ట్ర ప్రజలు చూశారని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు పూర్తి అవగాహనతో, అప్రమత్తంగా ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని బలపరిచారని అన్నారు.

అయినా జగన్ ఇంకా మారలేదని సోమిరెడ్డి విమర్శించారు. పాత, కాలం చెల్లిన రాజకీయ ఎత్తుగడలను తిరిగి అమలు చేసి, ప్రజల్లో భ్రమలు కల్పించాలని చూస్తున్నారని అన్నారు. కోర్టు, పెళ్లి, చావు వంటి కార్యక్రమాలకు వెళ్లినా కూడా జనసందోహం వచ్చిందని ప్రచారాలు చేయించుకుని తనపై ప్రజా వ్యతిరేకత తగ్గిందని చెప్పుకునేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇవన్నీ అవుట్‌డేటెడ్ స్ట్రాటజీలు అని, ప్రజలు ఇప్పటికే వాటిని కనిపెట్టారని స్పష్టం చేశారు.

చివరగా, సోమిరెడ్డి జగన్‌కు హితవు పలికారు. సొంత మీడియా ఎలివేషన్లు, డ్రోన్ కెమెరా ట్రిక్కులు, సోషల్ మీడియాలో విజువల్ ఎఫెక్ట్స్ ఆధారంగా రాజకీయాలు చేయడం ఆపాలని సూచించారు. ఇప్పటికైనా నిజాయతీగా ఉండటానికి ప్రయత్నించాలనే సూచిస్తూ, “నీవల్ల కాదనుకో… కనీసం ప్రయత్నించు” అని సూటిగా అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *