Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక కొత్త పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పాల్గొని ఆటో డ్రైవర్ల పరిస్థితులు, వారి సేవల గొప్పతనం గురించి ప్రస్తావించారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, స్త్రీ శక్తి పథకం అమలు సమయంలో ఆటో డ్రైవర్ల పరిస్థితిని విశ్లేషించాం. ఉచిత బస్సు సదుపాయం అందించడం వల్ల వారి ఉపాధికి సమస్యలు వస్తాయని చర్చించాము. కేబినెట్ సమావేశంలో సీఎం ఆటో డ్రైవర్లకు సహాయం చేయాలన్న హామీ ఇచ్చారు అని తెలిపారు. వైసీపీ పాలనలో ఆటో డ్రైవర్లు గ్రీన్ ట్యాక్స్ భారం, ఇతర పన్నుల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే వాటిని తగ్గించాం. ఆర్థిక సమస్యల మధ్య రూ. 436 కోట్ల భారం మేము సంతోషంగా మోస్తున్నాం. అర్హులైన ప్రతి ఆటో డ్రైవర్‌కు రూ. 15,000 రూపాయలు అందిస్తున్నాం అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
మంత్రి నారా లోకేష్ అన్నారు, ఆటో డ్రైవర్లు ఎల్లప్పుడూ నవ్వుతూ ప్రయాణికులను పలకరిస్తారు. ఇంట్లో ఎన్ని సమస్యలు ఉన్నా వారు సేవ కొనసాగిస్తారు. రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, ఎయిర్‌పోర్ట్‌లకు ఎక్కువ మంది ఆటోలను ఆధారంగా తీసుకుంటారు. అలాంటి వారి కోసం ఈ పథకం తీసుకొచ్చాం. అర్హత ఉన్న ప్రతి డ్రైవర్‌కు ఈ సహాయం అందుతుంది.
అలాగే, సమాజంలో మహిళలకు గౌరవం ఇవ్వాలని లోకేష్ సూచించారు. సమర్థ నాయకత్వం, మంచి పాలన ఉంటే ఏ రాష్ట్రమైనా అభివృద్ధి సాధించవచ్చు. ప్రజల సమస్యలు విని పరిష్కరించడమే మా ప్రభుత్వ లక్ష్యం అని ఆయన స్పష్టం చేశారు. ఈ కొత్త పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని ఆటో డ్రైవర్లకు ఆర్థిక భరోసా కల్పించడమే కాక, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపారు.