Sobhita Dhulipala: టాలీవుడ్, బాలీవుడ్‌లలో తన ప్రత్యేక నటనతో ప్రేక్షకులను మెప్పించిన నటి శోభితా ధూళిపాళ, ఇప్పుడు తమిళ చిత్రసీమలోకి (కోలీవుడ్) అడుగుపెడుతున్నారు. ప్రముఖ దర్శకుడు పా. రంజిత్ తెరకెక్కిస్తున్న ‘వెట్టువం’ అనే సినిమాలో ఆమె ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఇది ఆమె తమిళంలో ప్రధాన హీరోయిన్‌గా నటిస్తున్న తొలి చిత్రం. ఈ ప్రాజెక్ట్‌లో శోభితతో పాటు స్టార్ నటుడు ఆర్య ఒక కీలక పాత్ర పోషిస్తుండగా, దినేష్ రవి హీరోగా నటిస్తున్నారు.
పా. రంజిత్ సినిమాలకు ఒక ప్రత్యేక శైలి ఉంటుంది. సమాజంలో ఉన్న సమస్యలను, వైవిధ్యమైన అంశాలను తెరపై చూపించడానికి ఆయన ప్రసిద్ధి చెందారు. ‘వెట్టువం’ కూడా సామాజిక అంశాలతో కూడిన శక్తివంతమైన కథాంశంతో రూపొందుతోంది. ఆర్య, దినేష్ రవి నటన ఈ కథకు మరింత బలాన్ని చేకూరుస్తుందని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ త్వరలో షూటింగ్ ప్రారంభించుకోనుంది.
గతేడాది డిసెంబరులో శోభిత, నాగచైతన్యను వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఆమె కొత్త ప్రాజెక్టులు ఏవీ ప్రకటించకపోవడంతో, సినిమాలకు విరామం ఇస్తున్నారేమోనని చాలా మంది అనుకున్నారు. అంతేకాకుండా, కొద్ది రోజుల క్రితం శోభిత ప్రెగ్నెన్సీ గురించి కూడా కొన్ని పుకార్లు వచ్చాయి.
Also Read: Nani: నాని – సుజీత్ బిగ్ బ్యాంగ్ సినిమా స్టార్ట్!
అయితే, ఈ తమిళ సినిమా ‘వెట్టువం’ ప్రకటనతో ఆ పుకార్లకు చెక్ పడింది. శోభితా సినిమాల నుంచి విరామం తీసుకోవడం లేదని, ‘వెట్టువం’ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ద్వారా స్పష్టం చేశారు. నాగచైతన్య ప్రస్తుతం ఒక హారర్ మూవీలో నటిస్తున్నారు. శోభితా-నాగచైతన్య దంపతులు ఇటీవల హైదరాబాద్‌లో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో జంటగా కనిపించారు.
శోభితా ధూళిపాళ గతంలో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమాలో నటించినప్పటికీ, అందులో ఆమెది ప్రధాన హీరోయిన్ పాత్ర కాదు. ఇప్పుడు మాత్రం, ‘వెట్టువం’ సినిమాలో ఆమె లీడ్ రోల్‌లో నటిస్తున్నారు. తెలుగులో ఆమె ఇంతకుముందు ‘గూఢచారి’, ‘మేజర్’ వంటి హిట్ చిత్రాల్లో నటించారు. పెళ్లి తర్వాత ఆమె తెలుగులో చేస్తారని అందరూ భావించినా, తమిళ చిత్రానికి ఓకే చెప్పడం విశేషం.