Mexico Plane Crash: మెక్సికోలో మంగళవారం (డిసెంబర్ 16) ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. అత్యవసరంగా ల్యాండింగ్ అవుతున్న ఒక ప్రైవేట్ జెట్, శాన్ మాటియో అటెన్ కో ప్రాంతంలోని ఓ గోడౌన్ పైకప్పును ఢీకొట్టడంతో మంటలు చెలరేగి, విమానం పూర్తిగా దగ్ధమైంది. ఈ హృదయ విదారక ఘటనలో ఏడుగురు ప్రయాణికులు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
ఏం జరిగింది?
ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో సిబ్బందితో సహా మొత్తం పది మంది ఉన్నట్లు సమాచారం. అకాపుల్కో నగరంలోని ప్రయాణికులను ఎక్కించుకుని ఈ ప్రైవేట్ జెట్ మెక్సికోలోని టోలుకా ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరింది. అయితే, సాంకేతిక లోపం తలెత్తడంతో పైలట్లు అత్యవసర ల్యాండింగ్‌కు ప్రయత్నించారు.
ఇది కూడా చదవండి: M. S. Subbulakshmi: ఎం.ఎస్.సుబ్బులక్ష్మి బయోపిక్.. గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో.. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం..?
ఈ క్రమంలోనే విమానం సమీపంలోని ఓ సాకర్ మైదానంలో దిగడానికి ప్రయత్నించింది. అయితే, దురదృష్టవశాత్తు అదుపుతప్పిన జెట్.. అక్కడ ఉన్న ఒక బిజినెస్ సంస్థకు చెందిన భారీ మెటల్ పైకప్పును బలంగా ఢీకొట్టింది. ఈ ధాటికి విమానంలో భారీగా మంటలు చెలరేగి, క్షణాల్లో అది పూర్తిగా బూడిదైపోయింది.
క్షతగాత్రులు, సహాయక చర్యలు
ప్రమాద తీవ్రత కారణంగా విమానంలో ప్రయాణిస్తున్న ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. ఇప్పటివరకు ఏడు మృతదేహాలను సహాయక బృందాలు వెలికి తీశాయి. తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
అంతేకాకుండా, విమానం ఢీకొన్న గోడౌన్‌లో పనిచేస్తున్న సుమారు 130 మంది ఉద్యోగులను అగ్నిమాపక, రెస్క్యూ సిబ్బంది సురక్షితంగా రక్షించగలిగారు. గోడౌన్ పైకప్పుకు మాత్రమే నష్టం జరగడంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. ఈ ఘటనపై స్థానిక విమానయాన అధికారులు విచారణకు ఆదేశించారు.

