Sivakarthikeyan: తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ ఇటీవల ‘అమరన్’ మూవీతో గ్రాండ్ విక్టరీని తన ఖాతాలో వేసుకున్నాడు. అతనితో ప్రస్తుతం దర్శకురాలు సుధా కొంగర ఓ సినిమా చేయబోతోంది. దీనికి ‘పురనానూరు’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఇది శివ కార్తికేయన్ కు 25వ చిత్రం. అయితే ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్ళక ముందే శివ కార్తికేయన్, సుధా కొంగర మధ్య చిన్నపాటి వివాదం చెలరేగినట్టుగా కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ప్రోమోను షూట్ చేయడానికి హీరో శివ కార్తికేయన్ ను పిలిపించారట. ఆయన ఎప్పటిలానే పొడవాటి గడ్డంతో ఉండటంతో సుధా కొంగర అసంతృప్తిని వ్యక్తం చేసిన్టటు సమాచారం. కాస్తంత ట్రిమ్ చేసుకుని షూట్ కు రమ్మని చెప్పినా డైరెక్షన్ టీమ్ మాట శివ కార్తికేయన్ వినలేదని, దాంతో అతనితో సుధా కొంగర సెట్ లో వాదనకు దిగిందని తెలుస్తోంది. ఆమె వ్యవహార శైలి నచ్చక శివ కార్తికేయన్ సెట్ నుండి బయటకు వెళ్ళిపోయాడని అంటున్నారు. మరి వీరి మధ్య చెలరేగిన వివాదానికి ఎప్పుడు తెర పడుతుందో చూడాలి.
