Phone Tapping Case: తెలంగాణ రాజకీయాల్లో పెద్ద దుమారం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ మరోసారి విచారణను వేగవంతం చేసింది. ఇన్నాళ్లు కాస్త స్తబ్దుగా ఉన్న ఈ కేసులో, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓఎస్డీగా పనిచేసిన రాజశేఖర్‌రెడ్డిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఆయన్ని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల హైదరాబాద్ సీపీగా బాధ్యతలు చేపట్టిన సజ్జనార్ గారు, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. కేసు దర్యాప్తు ఏ దశలో ఉందో, ఇప్పటి వరకు ఏ చార్జ్ షీట్లు దాఖలు చేశారో తెలుసుకుని, విచారణకు దిశానిర్దేశం చేశారు. ఈ సమీక్ష తర్వాతే కేసు విచారణలో ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది.
విచారణలో కీలక అంశాలు: అందుకే ఓఎస్డీకి పిలుపు!
ఈ కేసులో సిట్ గతంలో చాలాసార్లు బాధితులు మరియు నిందితులను విచారించింది. నలుగురు పోలీసు అధికారులను కూడా సస్పెండ్ చేసింది. ఈ కేసులో ముఖ్య నిందితుడిగా ఉన్న రాధాకిషన్‌రావును అరెస్ట్ చేసినప్పుడు, ఆయన రిమాండ్ రిపోర్టులో ఒక కీలకమైన పదం వెలుగులోకి వచ్చింది. అందులో బీఆర్ఎస్ సుప్రీం అనే పదాన్ని వాడారు. అంటే, కేసీఆర్ ఆదేశాల మేరకే తాము ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడినట్లు అప్పట్లో రాధాకిషన్‌రావు చెప్పినట్లు ఆ రిపోర్టులో స్పష్టంగా ఉంది. ఈ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకునే, అప్పటి ముఖ్యమంత్రికి ఓఎస్డీగా సన్నిహితంగా పనిచేసిన రాజశేఖర్‌రెడ్డిని కేసులో మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి విచారణకు పిలిచినట్లు సమాచారం.
