AP Liquor Scam: ఆంధ్రప్రదేశ్‌లో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణానికి సంబంధించి సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) కీలక ముందడుగు వేసింది. ఈ కేసులో 49వ నిందితుడిగా ఉన్న ముంబైకి చెందిన వ్యాపారి అనిల్ చోఖ్రాను సిట్ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. డొల్ల కంపెనీల ద్వారా ముడుపుల సొమ్మును మళ్లించడంలో, మనీ లాండరింగ్ చేయడంలో ఇతను కీలకపాత్ర పోషించినట్లు దర్యాప్తులో తేలింది.
గత ప్రభుత్వంలో అత్యధికంగా మద్యం సరఫరా ఆర్డర్లు పొందిన మూడు ప్రధాన కంపెనీలు—అదాన్ డిస్టిలరీస్, ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్, లీలా డిస్టిలరీస్—నుంచి అప్పటి ప్రభుత్వ పెద్దలకు నగదు రూపంలో ముడుపులు చెల్లించేందుకు అనిల్ చోఖ్రా సహకరించినట్లు సిట్ గుర్తించింది. ఈ మూడు సంస్థలు కలిపి మొత్తం రూ. 77.55 కోట్లను అనిల్ చోఖ్రా నిర్వహిస్తున్న డొల్ల కంపెనీల ఖాతాల్లోకి మళ్లించాయి. ఈ డొల్ల కంపెనీలు, రాజ్ కెసిరెడ్డి (ఏ-1), ముప్పిడి అవినాష్‌రెడ్డి (ఏ-7)ల నియంత్రణలో ఉండే మద్యం సంస్థల నుంచి నిధులను తీసుకున్నట్లు సిట్ తేల్చింది.
అనిల్ చోఖ్రా దాదాపు 35 డొల్ల కంపెనీలను (షెల్ కంపెనీలను) నకిలీ పేర్లు, డమ్మీ డైరెక్టర్ల సహాయంతో ఏర్పాటు చేసి, నిర్వహించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ డొల్ల కంపెనీల నెట్‌వర్క్ ద్వారా నిధులను బహుళ అంచెల్లో మళ్లించి, ఆడిట్‌కు దొరకకుండా, నేరం గుట్టు బయటపడకుండా చూసుకున్నట్లు అధికారులు తెలిపారు.
Also Read: Bihar Assembly Elections: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఫలితం..30 ఓట్ల తేడాతో
నిధుల రూటింగ్ (Routing), లేయరింగ్ (Layering) వంటి మనీ లాండరింగ్ ప్రక్రియల్లో అనిల్ చోఖ్రా సిద్ధహస్తుడు. అతను తప్పుడు పత్రాలు, మోసపూరిత బులియన్ ట్రేడ్ లావాదేవీల ద్వారా మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు సిట్ గుర్తించింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఇతనిపై ఇప్పటికే అనేక కేసులు ఉండగా, గతంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇతన్ని రెండు సార్లు అరెస్టు చేసింది.
గత 13 రోజులుగా ముంబైలోని వివిధ ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన సిట్ బృందాలు కీలక ఆధారాలు సేకరించి అనిల్ చోఖ్రాను అదుపులోకి తీసుకున్నాయి. ఠాణెలోని బెలాపూర్ కోర్టులో హాజరుపరిచిన అనంతరం, ట్రాన్సిట్ వారెంట్‌పై అతన్ని విజయవాడకు తరలించారు. ఈరోజు (శనివారం) ఇక్కడి ఏసీబీ న్యాయస్థానంలో నిందితుడిని హాజరుపరిచే అవకాశం ఉంది. అనిల్ చోఖ్రా విచారణ ద్వారా కొల్లగొట్టిన సొత్తులో అధిక భాగం విదేశాల్లోని ఖాతాలకు తరలించారనే ఆరోపణలపై మరిన్ని వివరాలు బయటపడతాయని సిట్ భావిస్తోంది.

