TTD Laddu Case: శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణను మరింత వేగవంతం చేసింది. ఈ కేసులో మాజీ టీటీడీ అధికారులు, పాలక మండలి సభ్యుల పాత్రపై దృష్టి సారించిన సిట్.. కీలక వ్యక్తులను విచారిస్తోంది.
మాజీ ఈవో ధర్మారెడ్డి విచారణ
కల్తీ నెయ్యి కేసు దర్యాప్తులో భాగంగా, గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అదనపు ఈవోగా పని చేసిన ధర్మారెడ్డి ఈరోజు (మంగళవారం) తిరుపతిలోని సిట్ కార్యాలయానికి హాజరయ్యారు.
టీటీడీలో అదనపు ఈవోగా ఆయన పని చేసిన సమయంలో నెయ్యి కొనుగోళ్ల వ్యవహారంపై అధికారులు ఆయనను ప్రశ్నించి స్టేట్‌మెంట్ రికార్డు చేస్తున్నారు.
మాజీ చైర్మన్‌కు నోటీసులు
ఈ కేసులో సిట్ కీలక నిర్ణయం తీసుకుంది. టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది. కల్తీ నెయ్యి సరఫరా జరిగిన కాలంలో వైవీ సుబ్బారెడ్డి చైర్మన్‌గా ఉన్నందున, ఎల్లుండి (గురువారం) విచారణకు హాజరుకావాలని సిట్ ఆయనను ఆదేశించింది.
ఇది కూడా చదవండి: Narendra Modi: బాధ్యులను వదిలే ప్రసక్తే లేదు.. ఉగ్ర కుట్ర మూలాలను ఛేదిస్తాం
కేసులోని కీలక అంశాలు
కల్తీ నెయ్యి కేసులో ఇప్పటివరకు 24 మందిపై కేసు నమోదు కాగా, మొత్తం 15 మంది నిందితులను సిట్ ఇప్పటికే అదుపులోకి తీసుకుంది. తాజాగా A16గా ఉన్న అజయ్ కుమార్ సుగంధ్‌ను సిట్ అరెస్ట్ చేసింది.
గత ప్రభుత్వం హయాంలో భోలేబాబా ఓరోగానిక్ డెయిరీ సంస్థ టీటీడీకి మొత్తం 68.17 లక్షల కిలోల నెయ్యిని సరఫరా చేసింది. ఇందులో 57.56 లక్షల కిలోల పామాయిల్, పామ్ కెర్న్ ఆయిల్, పామ్ స్టెరిన్ తదితర రసాయనాలు వినియోగించినట్లు సిట్ నిర్ధారించింది.
ఈ కల్తీ నెయ్యి విలువ రూ.137.22 కోట్లుగా లెక్కించారు. ఇందులో 37.38 లక్షల కిలోల నెయ్యిని పునబాకలోని శ్రీ వైష్ణవి డెయిరీ ద్వారా భోలేబాబా కంపెనీ తిరుమలకు సరఫరా చేసింది.
గుజరాత్ రాష్ట్రం ఆనంద్‌లోని ఎన్‌డీడీబీ కాఫ్ (NDDB Calf) నెయ్యిని మరోసారి పరీక్షించి, ఇదే ఏడాది మార్చి 27న కల్తీని ధ్రువీకరించినట్లు సిట్ వెల్లడించింది.
మాజీ ఈవో మరియు మాజీ చైర్మన్‌లను విచారించడం ద్వారా, ఈ భారీ కల్తీ కుంభకోణంలో టీటీడీలోని ఉన్నత స్థాయి అధికారుల పాత్రపై సిట్ దృష్టి సారించినట్లు స్పష్టమవుతోంది.

