Telangana: రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 6వ తేదీ నుంచి ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఒంటిపూట బడులను నిర్వహించనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే ఆదేశాలను జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 6 నుంచి ఇదే నెల 31 వరకు తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించనున్న సమగ్ర కుటుంబ సర్వే నేపథ్యంలో ఒంటిపూట బడులను నిర్వహించనున్నారు.
Telangana: కులగణన సర్వే కోసం 36,559 మంది ప్రాథమికోన్నత పాఠశాలల టీచర్లను, 3,414 మంది ప్రాథమికోన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నియమించింది. వీరితో పాటు మరో 8 వేల మంది పాఠశాల విద్యాశాఖ సిబ్బంది ఈ సర్వేలో పాల్గొననున్నారు. దీంతో సర్వే పూర్తయ్యేంత వరకు ఆయా పాఠశాలలకు ఒంటిపూట బడులనే నిర్వహించనున్నారు.
Telangana: ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు టీచర్లు ఆయా పాఠశాలల్లో విధులు నిర్వహిస్తారు. అనంతరం సాయంత్ర పూట కులగణన సర్వేలో ఇంటింటికీ వెళ్లి కుటుంబాల వివరాలు సేకరించాల్సి ఉంటుంది. ఈ మేరకు ఇప్పటికే విద్యాశాఖ ఆదేశాలు జారీ కావడంతో, వివిధ ఉపాధ్యాయ సంఘాలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. అయినా ప్రభుత్వం నుంచి ఎటువంటి సవరణలు రాకపోవడంతో 6 నుంచి తప్పనిసరిగా ఒంటిపూట బడులు ఖాయంగా కనిపిస్తున్నది.