Singer Chinmayi

Singer Chinmayi: సింగర్ చిన్మయిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్, సీపీకి ఫిర్యాదు!

Singer Chinmayi: ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద మరోసారి సోషల్ మీడియాలో వేధింపులకు గురయ్యారు. ఆన్‌లైన్‌లో కొందరు ట్రోలర్లు అసభ్యకరమైన వ్యాఖ్యలతో, తనపై వ్యక్తిగత దూషణలతో దాడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ, ఆమె సీపీ (కమీషనర్ ఆఫ్ పోలీస్) సజ్జనార్‌కు ఫిర్యాదు చేశారు.

వివాదానికి కారణం: ‘మంగళసూత్రం’పై భర్త వ్యాఖ్యలు
ఈ తాజా వివాదం చిన్మయి భర్త, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూతో మొదలైంది. తమ వివాహంలో మంగళసూత్రం ధరించాలా వద్దా అనేది పూర్తిగా చిన్మయి వ్యక్తిగత ఇష్టం అని, దానిని ధరించమని తాను ఎప్పుడూ బలవంతం చేయలేదని రాహుల్ వ్యాఖ్యానించారు. మంగళసూత్రం అనేది ఒక సామాజిక కట్టుబాటు మాత్రమేనని ఆయన పేర్కొన్నారు.

ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. కొందరు నెటిజన్లు రాహుల్, చిన్మయి దంపతులపై తీవ్రంగా మండిపడుతూ, అసభ్యకరమైన పోస్టులతో ట్రోలింగ్ మొదలుపెట్టారు. ఈ ట్రోలింగ్ పట్ల చిన్మయి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. కొందరు యువకులు ఒక గ్రూప్‌గా ఏర్పడి పచ్చి బూతులతో దూషిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ వేధింపులు ఎంతవరకు వెళ్లాయంటే, “నా పిల్లలు చనిపోవాలని ఈ ట్రోలర్స్ కోరుకుంటున్నారు” అని చిన్మయి కన్నీటి పర్యంతమయ్యారు.

Also Read: Ravi Teja: వశిష్ఠతో రవితేజ మరో ఫాంటసీ ధమాకా!

ఈ వేధింపులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ చిన్మయి, పోలీస్ డిపార్ట్‌మెంట్‌ను ట్యాగ్ చేస్తూ, సీపీ సజ్జనార్‌ను అభ్యర్థించారు. “గౌరవనీయులైన సజ్జనార్ సార్, నేను ఈ రోజువారీ వేధింపులతో విసిగిపోయాను. తెలంగాణ మహిళలు దీనికంటే మెరుగైన అర్హత కలిగి ఉన్నారు. చట్టం తన పని తాను చేసుకోనివ్వండి” అని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సీపీ సజ్జనార్ వెంటనే స్పందించి, చిన్మయి ఫిర్యాదును సైబర్ క్రైమ్ పోలీసులకు అప్పగించారు.

ఈ ట్రోలింగ్ సందర్భంగా కొందరు నెటిజన్లు 2018లో మీటూ ఉద్యమం సమయంలో చిన్మయి ప్రముఖ కవి వైరముత్తుపై చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలను కూడా మళ్లీ ప్రస్తావించారు. ఆ ఆరోపణల గురించి చిన్మయిని ప్రశ్నిస్తూ, ఆమెపై వ్యంగ్యంగా కామెంట్లు చేశారు. దీనికి చిన్మయి ఘాటుగా స్పందించారు. “లైంగిక వేధింపులకు గురికావడం నా తప్పే. కానీ మీలాంటి పురుషులు నా లైంగిక వేధింపుల ఎపిసోడ్ గురించి ఎందుకు ప్రస్తావించాలి?” అంటూ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.

సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్న చిన్మయి, గతంలో తమిళ సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్‌పై గళం విప్పడం వల్ల ఆమెపై నిషేధం కూడా విధించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ సామాజిక అంశాలపై ఆమె తన పోరాటాన్ని ఆపలేదు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *