Silk Smitha: సిల్క్ స్మిత మరణం గురించి ఇప్పటికీ అనేక అనుమానాలు కొనసాగుతున్నాయి. ఆమె ఆత్మహత్య చేసుకున్నారనే విషయంపై చాలా మంది ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అయితే ఇటీవల సిల్క్ స్మిత బయోపిక్‌ను ప్రకటించడంతో, ఆమె మరణం గురించి మరోసారి చర్చ మొదలైంది. ఈ క్రమంలో సిల్క్ స్మిత తమ్ముడు నాగవరప్రసాద్ ఒక యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని సంచలన విషయాలు వెల్లడించారు.
సినిమాల్లోకి వెళ్లిన సిల్క్ స్మిత
నాగవరప్రసాద్ మాట్లాడుతూ, “మా కుటుంబంలో ఎవరూ పెద్దగా చదువుకోలేదు. కానీ మా అక్క మొదటిసారిగా సినిమాల్లోకి వెళ్లింది. అదృష్టం కలిసి రావడంతో ఆమె స్టార్‌గా ఎదిగింది. మద్రాసులో ఆమె ఉన్నప్పుడు, చాలా సార్లు మా అక్కను కలవడానికి వెళ్లేవాడిని,” అని చెప్పారు.
తనపై ప్రేమతో కారు కొనిచ్చిన సిల్క్ స్మిత
“నేను మోటార్ ఫీల్డ్‌లో వర్క్ చేసేవాడిని. తరచూ ఆమెను కలవడానికి నేను వెళ్లి వస్తుండటంతో నా ఇబ్బంది చూసి ఒక కారు కొనిచ్చింది. కానీ మా అక్క మరణం మాలో నిత్యమైన ఆవేదనను నింపింది,” అని నాగవరప్రసాద్ గుర్తు చేసుకున్నారు.
ఆత్మహత్య కాదు, హత్య
సిల్క్ స్మిత చనిపోవడం గురించి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. “మా అక్క చనిపోయేంత పిరికిది కాదు. ఆమెని ప్లాన్ ప్రకారం చంపేశారు. ఓ వ్యక్తి, ఎవరు తన భార్య, పిల్లలతో కలిసి మా అక్కను హత్య చేశారు. ఆమెను చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు. మేము అక్కడికి వెళ్లేసరికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది,” అని నాగవరప్రసాద్ తెలిపారు.
ఆస్తులు, డబ్బులు లూటీ
నాగవరప్రసాద్ ప్రకారం, సిల్క్ స్మిత దాదాపు రూ. 20 కోట్లు సంపాదించింది. కానీ ఆ డబ్బులో ఒక్క రూపాయి కూడా వారి కుటుంబానికి చేరలేదని చెప్పారు. “ఆమె చనిపోయేలోపే నగలు, డబ్బు, డాక్యుమెంట్లన్నీ కొట్టేశారు. ఆమెను అనాధ శవంలా రోడ్డు మీద తీసుకెళ్లి ఏడ్చాము,” అని బాధతో చెప్పారు.
ఇండస్ట్రీ నుంచి మద్దతు లేకపోవడం
“మా అక్క మరణ వార్త విని ఇండస్ట్రీ నుంచి అర్జున్ తప్ప ఎవరూ రాలేదు. కానీ స్థానిక ప్రజలు మాత్రం పెద్ద సంఖ్యలో వచ్చారు. మా అక్కపై జరిగిన అన్యాయాన్ని మేము ఎవరితోనూ చెప్పుకోలేకపోయాం,” అని ఆయన వాపోయారు.

