Sikandar Raza: బంతి పడితే బాదుడే బాదుడు.. అయితే ఫోర్ లేదంటే సిక్సర్.. మైదానంలో జింబాబ్వే బ్యాటర్లు వీర విధ్వంసం సృష్టించడంతో అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా జింబాబ్వే చరిత్ర సృష్టించింది. గాంబియాతో జరిగిన మ్యాచ్ లో 33 బంతుల్లో సెంచరీ సాధించిన క్రికెటర్ గా సికిందర్ రజా, 20 ఓవర్లలో 344 పరుగులు చేసి అత్యధిక పరుగుల రికార్డుతో జింబాబ్వే ప్రపంచ రికార్డులు నమోదు చేసింది.
టీ20 ప్రపంచకప్ రీజినల్ ఆఫ్రికా క్వాలిఫయర్‌లో భాగంగా బుధవారం గాంబియాతో జరిగిన మ్యాచ్ లో దొరికిందే అవకాశం అన్నట్లు.. ఆకాశమే హద్దుగా చెలరేగిన జింబాబ్వే 20 ఓవర్లలో 4 వికెట్లకు 344 పరుగులు చేసింది. గతేడాది ఆసియా క్రీడల్లో నేపాల్ 314 పరుగులతో మంగోలియాపై నెలకొల్పిన రికార్డును ఇప్పుడు జింబాబ్వే తిరగరాసింది. 7 ఫోర్లు, 15 సిక్సర్లతో జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా 133 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. అంతేకాదు 33 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకుని 35 బంతుల్లో టీ20 సెంచరీ నమోదు చేసిన రోహిత్ రికార్డును బ్రేక్ చేశాడు. టీ20ల్లో సెంచరీ సాధించిన తొలి జింబాబ్వే ఆటగాడిగా నిలిచాడు. గాంబియా బౌలర్లలో జొబార్టె 93 పరుగులు సమర్పించుకుని ఓ టీ20 మ్యాచ్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా నిలిచాడు. ఛేదనలో గాంబియా 14.4 ఓవర్లలో 54 పరుగులకే కుప్పకూలడంతో 290 పరుగుల తేడాతో జింబాబ్వే గెలిచింది. ఇది కూడా ప్రపంచ రికార్డే కావడం విశేషం.