Using Phone In Toilet: మనం తినేటప్పుడు, పడుకునేటప్పుడు, పనిచేసేటప్పుడు.. ఇలా ప్రతిచోటా ఫోన్ మనతోనే ఉంటుంది. ముఖ్యంగా చాలామంది టాయిలెట్‌కి వెళ్లేటప్పుడు కూడా ఫోన్‌ని తీసుకెళ్తున్నారు. టాయిలెట్‌లో కూర్చుని ఎక్కువసేపు ఫోన్ చూడటం, రీల్స్ స్క్రోల్ చేయడం, మెసేజ్‌లు పంపడం వంటివి చాలా మామూలు అలవాటుగా మారిపోయింది. కానీ, ఈ అలవాటు మన ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం.
ఎందుకంటే..
1. ఇన్ఫెక్షన్లు, బ్యాక్టీరియా సమస్యలు
టాయిలెట్‌లో ఫోన్ వాడటం వల్ల అనేక రకాల జెర్మ్స్, బ్యాక్టీరియా ఫోన్‌కి అంటుకుంటాయి. టాయిలెట్ సీటు, డోర్ హ్యాండిల్స్, వాటర్ ఫ్లష్ వంటి వాటిపై లక్షలాది బ్యాక్టీరియా ఉంటాయి. మనం ఫోన్‌ను పట్టుకుని వాటిని తాకినప్పుడు, ఆ బ్యాక్టీరియా అంతా ఫోన్‌కి అంటుకుంటుంది. ఈ బ్యాక్టీరియా మన చేతుల ద్వారా మన నోటిలోకి వెళ్లి అనేక అంటువ్యాధులకు కారణం కావచ్చు. ఒక అధ్యయనం ప్రకారం, టాయిలెట్‌లో ఉన్న దానికంటే ఫోన్ స్క్రీన్‌పై పది రెట్లు ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుందని తేలింది.
2. పైల్స్ సమస్య పెరిగే అవకాశం
టాయిలెట్‌లో ఎక్కువసేపు కూర్చునే అలవాటు వల్ల పైల్స్ (హెమోరాయిడ్స్) వచ్చే ప్రమాదం పెరుగుతుంది. టాయిలెట్‌లో ఎక్కువ సమయం కూర్చోవడం వల్ల పురీషనాళం (rectum) మీద ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల అక్కడి రక్తనాళాలు ఉబ్బిపోయి పైల్స్‌కు దారితీస్తాయి. వైద్య నిపుణుల ప్రకారం, టాయిలెట్‌లో ఫోన్ వాడేవారిలో 45% మందికి పైల్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.
3. నిశ్చల జీవనశైలితో జబ్బులు
టాయిలెట్‌లో ఫోన్ చూడటం, జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం, తగినంత నీరు తాగకపోవడం వంటి అలవాట్లు మన ఆరోగ్యాన్ని మరింత దెబ్బతీస్తాయి. ఈ అలవాట్లు అన్నీ కలిసి పైల్స్ వంటి జబ్బుల ప్రమాదాన్ని చాలా రెట్లు పెంచుతాయి. డాక్టర్ల అభిప్రాయం ప్రకారం, రీల్స్ చూసే అలవాటు వల్ల చాలామంది కనీసం 10 నిమిషాలు టాయిలెట్ సీటుపై గడుపుతున్నారు. దీనివల్ల శరీరంలోని సున్నితమైన భాగాలకు ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.