Siddaramaiah: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తాను ప్రయాణించే అధికారిక వాహనంపై ఉన్న పెండింగ్ ట్రాఫిక్ చలానాలను చెల్లించారు. ఇటీవల కర్ణాటక ప్రభుత్వం ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి 50 శాతం రాయితీ పథకం ప్రకటించగా, సీఎం కూడా అదే పథకాన్ని వినియోగించుకున్నారు.
ముఖ్యమంత్రి వాహనంపై మొత్తం 7 ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదయ్యాయి. అందులో సీటుబెల్టు ధరించకపోవడం 6 సార్లు, అతివేగం కారణంగా ఒకసారి చలానాలు విధించారు. ఈ పెండింగ్ చలానాలు చెల్లించలేదన్న విమర్శలు సోషల్ మీడియాలో రావడంతో, సీఎం కార్యాలయం స్పందించి రాయితీతో కలిపి రూ. 8,750 చెల్లించింది.
ప్రభుత్వం ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 19 వరకు ఈ రాయితీ పథకాన్ని అమలు చేస్తోంది. జరిమానా విధించబడిన వాహనదారులు 50% చెల్లిస్తే, మిగతా మొత్తాన్ని మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 40 కోట్లు వసూలు చేసినట్లు అధికారులు వెల్లడించారు.