Siddaramaiah: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, దక్షిణాది రాష్ట్రాల్లో హిందీ, ఇంగ్లీష్ భాషల ప్రభావంపై వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు భాషలు పిల్లల నైపుణ్యాలను బలహీనపరుస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. విద్యాసంస్థల్లో మాతృభాషను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.
కర్ణాటక రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సిద్ధరామయ్య మాట్లాడారు. కేంద్రం హిందీ భాషను బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తోందని, కర్ణాటకపై సవతి తల్లి ప్రేమ చూపుతోందని ఆయన విమర్శించారు. అభివృద్ధి చెందిన దేశాల్లో పిల్లలు తమ మాతృభాషలోనే విద్యను పొందుతున్నారని, కానీ భారత్‌లో మాత్రం విరుద్ధ పరిస్థితి కనిపిస్తోందని అన్నారు.
హిందీ, ఇంగ్లీష్ మీడియం వల్ల పిల్లల సామర్థ్యాలు తగ్గిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేసిన సిద్ధరామయ్య, మాతృభాషను బోధనా మాధ్యమంగా ప్రవేశపెట్టేలా చట్టం అవసరమని పునరుద్ఘాటించారు. విద్యలో కన్నడ భాషకు జరుగుతున్న నిర్లక్ష్యం రాష్ట్రానికి ఎన్నో సమస్యలకు దారితీస్తోందని పేర్కొన్నారు.
కేంద్రం హిందీ, సంస్కృత భాషల అభివృద్ధికి నిధులు కేటాయిస్తుంటే, ఇతర మాతృభాషలకు సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. కన్నడను వ్యతిరేకించే వారిని రాష్ట్ర ప్రజలు కూడా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.
కర్ణాటక నుంచి కేంద్ర ప్రభుత్వానికి ₹4.5 లక్షల కోట్ల ఆదాయం వెళుతుందని, కానీ రాష్ట్ర అభివృద్ధికి తగిన ఫండులు కేంద్రం ఇవ్వడంలేదని సిద్ధరామయ్య విమర్శించారు.

