Siddaramaiah

Siddaramaiah: అధిష్ఠానం ఎప్పుడు ఆదేశిస్తే డీకే అప్పుడు సీఎం అవుతారు

Siddaramaiah: కర్ణాటక రాజకీయాల్లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఈరోజు (మంగళవారం) ఉదయం డిప్యూటీ సీఎం నివాసంలో జరిగిన అల్పాహార సమావేశం (Breakfast Meet) అనంతరం ఇరువురు నాయకులు పూర్తి ఐక్యతా సందేశాన్ని పంపారు. తాము ఐక్యంగా ఉన్నామని, అధిష్ఠానం ఆదేశాలే శిరోధార్యమని స్పష్టం చేశారు.

మేము ఐక్యంగా ఉన్నాం: సిద్ధరామయ్య, డీకే స్పష్టం

కొద్దిరోజుల క్రితం ముఖ్యమంత్రి నివాసంలో డీకే శివకుమార్ అల్పాహారం చేయగా, తాజాగా మంగళవారం సిద్ధరామయ్య.. డీకే శివకుమార్ నివాసానికి కారులో వెళ్లి ఆయన ఇచ్చిన విందుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరు అగ్ర నాయకులు ముఖ్యమైన రాజకీయ, పార్టీ అంశాలపై చర్చించారు.

తాము ఐక్యంగా ఉన్నామని, ఒకే సిద్ధాంతాన్ని అనుసరిస్తూ ప్రభుత్వాన్ని సమర్థంగా నడుపుతామని ఇద్దరూ ప్రకటించారు. అంతేకాకుండా, 2028 అసెంబ్లీ ఎన్నికలను కూడా కలిసే ఎదుర్కొంటామని సిద్ధరామయ్య ధీమా వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: IT Raids: ఐటీ దాడులు.. షాగౌస్, పిస్తాహౌస్.. మెహఫిల్ ఓనర్ లే టార్గెట్

పార్టీ నాయకత్వంలో ఎప్పుడు మార్పు వచ్చినా లేదా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అంశం వచ్చినా, హైకమాండ్ (అధిష్ఠానం) తీసుకునే నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని తేల్చి చెప్పారు. “అధిష్ఠానం ఎప్పుడు ఆదేశిస్తే డీకే అప్పుడు సీఎం అవుతారు” అంటూ సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి.

ఢిల్లీ పయనం, అసెంబ్లీ వ్యూహం

అల్పాహార విందులో కేవలం ఐక్యత గురించి మాత్రమే కాక, రాబోయే సవాళ్లపైనా నేతలు దృష్టి సారించారు. డిసెంబర్ 8న బెళగావిలో ప్రారంభం కానున్న శాసనసభ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఇరువురు చర్చించారు.

కర్ణాటకకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలందరితో సమావేశం అయ్యేందుకు డిసెంబర్ 8న ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లనున్నారు. అక్కడ చెరకు, మొక్కజొన్న సాగుదారులతో సహా రాష్ట్రానికి సంబంధించిన ముఖ్య సమస్యలను చర్చించనున్నారు.

ఈ సందర్భంగా డీకే శివకుమార్ ‘X’లో పోస్ట్ చేస్తూ, “కాంగ్రెస్ దార్శనికత కింద మన రాష్ట్ర సుపరిపాలన మరియు నిరంతర అభివృద్ధికి మా నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ ఈరోజు నా నివాసంలో గౌరవనీయులైన ముఖ్యమంత్రికి అల్పాహారం ఇచ్చాను” అని పేర్కొన్నారు.

నాయకత్వ వివాదంపై గందరగోళం సృష్టించవద్దని మీడియాను ఉద్దేశిస్తూ సోమవారం డీకే శివకుమార్ వ్యాఖ్యానించారు. తాము “సోదరుల మాదిరిగా పనిచేస్తున్నాం” అని ఆయన చెప్పడం గమనార్హం. కాగా, ఈ పరస్పర పర్యటనలు కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాల మేరకే జరుగుతున్నట్లు తెలుస్తోంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *