Navi Mumbai: నవీ ముంబైలో ఓ విస్తుపోయే సంఘటన బయటపడింది. మూడేళ్లుగా తన ఇంటిలోనే బయట ప్రపంచంతో సంబంధాలు లేకుండా గడిపిన ఓ టెకీ గురించి తెలిసిన వివరాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో పొరుగువారు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
జుయ్‌నగర్‌కు చెందిన అనుప్ కుమార్ నాయర్ గతంలో ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేసేవారు. ఉద్యోగం నుంచి రిటైర్ అయిన తర్వాత ఆయన తన ఇంటికే పరిమితం అయ్యారు. అయితే, గత మూడు సంవత్సరాలుగా అనుప్ తన ఇంటి నుంచి అస్సలు బయటకు రాలేదు. బయటి ప్రపంచంతో అన్ని సంబంధాలను తెంచుకుని, ఎవరికీ ఫోన్ చేయకుండా, ఎవరినీ తన ఇంటికి రానివ్వకుండా ఒంటరిగా జీవించాడు. ఆకలి వేసినప్పుడు మాత్రమే ఆన్‌లైన్‌లో ఆహారం ఆర్డర్ చేసుకుని తినేవాడు.
మూడేళ్లుగా ఇంటిని శుభ్రం చేయకపోవడంతో అది చెత్తకుప్పలా మారిపోయింది. విపరీతమైన కంపు రావడంతో పొరుగువారికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అనుప్ ఇంటికి చేరుకుని తలుపు కొట్టగా, అనుప్ తలుపు తీశాడు. అతడిని చూసి పోలీసులు షాక్ అయ్యారు. భారీగా పెరిగిన గడ్డం, జుట్టుతో అనుప్ పిచ్చివాడిలా కనిపించాడు. పోలీసులు ఇంట్లోకి వెళ్లి చూడగా, చెత్తతో నిండిన ఆ ఇల్లు ఒక డంప్ యార్డ్‌ను తలపించేలా ఉంది. దీంతో పోలీసులు అనుప్‌ను అక్కడి నుంచి తరలించారు. అతడికి జుట్టు, గడ్డం తీయించి, స్నానం చేయించారు.
Also Read: Celebrity Cricket Mela: టెక్సాస్‌లో సెలెబ్రిటీ క్రికెట్ మేళా గ్రాండ్ సక్సెస్
Navi Mumbai: అనుప్ ఇలా కావడానికి తీవ్ర డిప్రెషన్ కారణమని తెలుస్తోంది. దాదాపు 20 సంవత్సరాల క్రితం అనుప్ సోదరుడు చనిపోయాడు. అప్పటి నుంచి ఆయన డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయారు. తల్లిదండ్రులు కూడా చనిపోయిన తర్వాత ఆయన పరిస్థితి మరింత విషమంగా మారింది. ఈ నేపథ్యంలోనే తీవ్రమైన డిప్రెషన్ కారణంగా ఆయన ఇంటికే పరిమితం అయిపోయినట్లు పోలీసులు, కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ఈ ఘటన నవీ ముంబైలో చర్చనీయాంశంగా మారింది.
