Kuppam: చిత్తూరు జిల్లా కుప్పం మండలంలోని బైరప్పకొట్టాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రసవం కోసం పుట్టింటికి వచ్చిన భార్య కీర్తనపై భర్త రాజేష్ కత్తితో దాడి చేసి గొంతు కోసిన సంఘటన స్థానికులను ఆందోళన కలిగించింది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ దాడి జరిగినట్లు పోలీసులు తెలిపారు. రాజేష్‌ను స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పజెప్పారు, ప్రస్తుతం అతడు పోలీసుల అదుపులో ఉన్నాడు.
రెండేళ్ల క్రితం తమిళనాడుకు చెందిన రాజేష్‌తో కీర్తనకు వివాహం జరిగింది. ఇటీవల ప్రసవం కోసం కీర్తన తన పుట్టింటికి వచ్చి, మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే, భార్యాభర్తల మధ్య గత కొంతకాలంగా కుటుంబ వివాదాలు నడుస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఈ వివాదాలే రాజేష్ ఈ దారుణానికి పాల్పడేలా చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కీర్తన తన పుట్టింట్లో ఉండగా, రాజేష్ అక్కడికి వచ్చి ఆమెపై కత్తితో దాడి చేసి గొంతు కోసాడు.
Also Read: Kerala: కేరళలో మైనర్ బాలుడిపై రెండేళ్లుగా 14 మంది లైంగికదాడి
కీర్తన పెద్దగా కేకలు వేయడంతో స్థానికులు వచ్చారు.ఈ క్రమంలో రాజేష్ తప్పించుకోవడానికి ఇంటి పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలుస్తోంది. అయితే, స్థానికులు అతడిని పట్టుకొని కుప్పం పోలీసులకు అప్పగించారు. దాడిలో తీవ్రంగా గాయపడిన కీర్తనను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం పిఎస్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, రాజేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కుటుంబ వివాదాలు ఇంతటి దారుణ సంఘటనలకు దారితీయడం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.