Bhimavaram: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో అత్యంత దారుణమైన ఘటన చోటు చేసుకుంది. సుంకరపద్దయ్య వీధిలో నివాసముంటున్న ఒక వ్యక్తి తన తల్లి, తమ్ముడిని కత్తితో నరికి హత్య చేశాడు. మృతులను గునుపూడి మహాలక్ష్మి (60), ఆమె చిన్న కొడుకు రవితేజ (33)గా గుర్తించారు.
ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తి, మహాలక్ష్మి పెద్ద కొడుకు గునుపూడి శ్రీనివాసరావు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, శ్రీనివాసరావుకు కొంతకాలంగా మానసిక స్థితి సరిగా లేదు. అందుకే అతను ఇంట్లోనే ఉంటున్నాడు. సోమవారం తెల్లవారుజామున ఇంట్లో అంతా నిద్రిస్తున్న సమయంలో శ్రీనివాసరావు అకస్మాత్తుగా తల్లి, తమ్ముడిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. వారు తప్పించుకునే అవకాశం లేకుండా కిరాతకంగా నరకడంతో, అక్కడికక్కడే మృతి చెందారు. మన్నా చర్చ్ ఎదురుగా ఉన్న ఇంట్లో ఈ ఘోరం జరిగింది.
Also Read: Uttar Pradesh: ఘోర విషాదం.. పిండి మిల్లు పేలి బాలుడు మృతి
నేరుగా పోలీసులకే సమాచారం
ఈ హత్య చేసిన ఒక గంట తర్వాత, నిందితుడు శ్రీనివాసరావు తానే స్వయంగా 112 (ఎమర్జెన్సీ నంబర్)కి ఫోన్ చేసి, తన తల్లిని, తమ్ముడిని హత్య చేశానని, లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. సమాచారం అందుకున్న వెంటనే జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి, డీఎస్పీ జై సూర్య, వన్‌టౌన్ సీఐ నాగరాజులతో కూడిన పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. పోలీసులు నిందితుడు శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నారు.
మానసిక సమస్యలే కారణమా?
ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి మీడియాతో మాట్లాడుతూ, శ్రీనివాసరావు మానసిక పరిస్థితి సరిగా లేదని ప్రాథమికంగా గుర్తించామని తెలిపారు. కరోనా సమయంలో తండ్రి మరణించినప్పటి నుండి అతనిలో ఈ సమస్య మొదలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శ్రీనివాసరావును ఆసుపత్రిలో పరీక్షల కోసం తరలించారు.
ఈ ఘటనపై ఫిర్యాదు చేయడానికి శ్రీనివాసరావు సోదరి బెంగళూరు నుండి వస్తున్నారని, వారి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి పూర్తి దర్యాప్తు చేస్తామని ఎస్పీ వెల్లడించారు. వ్యక్తిగత సమస్యలు, మానసిక పరిస్థితి వంటి కారణాల వల్ల ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

