Udaipur: రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కు చెందిన రేఖ (55) అనే మహిళ తన 17వ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ సంఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రేఖ గిరిజన కుటుంబానికి చెందినది. ఆమె కుటుంబం తీవ్ర పేదరికంలో ఉంది. రేఖ, ఆమె భర్త కవ్రా కలబేలియా జీవనోపాధి కోసం ప్లాస్టిక్, ఇనుము, కాగితం వంటి పాత సామాన్లు సేకరిస్తారు. వారికి సొంత ఇల్లు కూడా లేదు. ప్రభుత్వ పథకాలు ఉన్నప్పటికీ, వారు వాటి ప్రయోజనాలను పొందలేకపోతున్నారు. ఇది ఆమె 17వ కాన్పు. గతంలో పుట్టిన 16 మంది పిల్లలలో నలుగురు అబ్బాయిలు, ఒక అమ్మాయి పుట్టిన వెంటనే చనిపోయారు. మిగిలిన పిల్లలలో ఐదుగురికి అప్పటికే పెళ్ళిళ్ళై, వారికి పిల్లలు కూడా ఉన్నారు.
Also Read: Viral Video: డబ్బుల వర్షం కురిపించిన కోతి.. షాక్‌లో రైతు
రేఖను ఆసుపత్రిలో చేర్చినప్పుడు, ఆమె కుటుంబ సభ్యులు వైద్యులకు ఇది నాలుగో కాన్పు అని అబద్ధం చెప్పారు. అయితే, తర్వాత ఇది 17వ కాన్పు అని వెల్లడైంది. 55 సంవత్సరాల వయస్సులో రేఖ గర్భం దాల్చడం, 17వ కాన్పు కావడం వైద్యులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఆమె కుటుంబ ఆర్థిక పరిస్థితి, అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా ఆమె ఆరోగ్యంపై కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. రేఖ భర్త కావ్రా కల్బెలియా మాట్లాడుతూ తాము ఆర్థిక ఇబ్బందులను ఎదురుకుంటున్నామన్నారు. తమకు సొంత ఇల్లు లేదని, జీవితాలను తీర్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నామని అన్నారు. “మా పిల్లలను పోషించడానికి, నేను వడ్డీ వ్యాపారుల నుండి 20 శాతం వడ్డీకి డబ్బు అప్పుగా తీసుకోవలసి వచ్చింది. నేను లక్షల రూపాయలు తిరిగి చెల్లించాను, కానీ రుణ వడ్డీ ఇప్పటికీ పూర్తిగా చెల్లించలేదు” అని ఆయన చెప్పారు.

