Yashaswini Reddy: పాలకుర్తి నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్ పార్టీకి కొత్త తలనొప్పి మొదలైంది. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్త, సీనియర్ నాయకురాలు ఝాన్సీ రెడ్డికి వ్యతిరేకంగా స్థానిక కాంగ్రెస్ సీనియర్ నేతలు ఒక్కటయ్యారు. ఇది పాలకుర్తి రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది.
స్థానిక ఎన్నికలే కారణం
స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ అభ్యర్థులను నిలబెట్టే అంశంపై చర్చించేందుకు తొర్రూరు మార్కెట్ కమిటీ చైర్మన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఝాన్సీ రెడ్డి నాయకత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. “ఝాన్సీ రెడ్డి అధ్యక్షతన ఎన్నికలకు వెళ్తే డిపాజిట్లు కూడా రావని,” నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె వల్ల అసలైన కాంగ్రెస్ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని వారు ఆరోపించారు.
నాయకత్వానికి ఫిర్యాదుకు సిద్ధం
ఝాన్సీ రెడ్డి వ్యవహార శైలిపై కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేయాలని సీనియర్ నేతలు నిర్ణయించారు. ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్‌తో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలను కలిసి ఝాన్సీ రెడ్డిపై ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. రాబోయే రెండు రోజుల్లో గాంధీ భవన్‌కు వెళ్లాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు.