Shivadar Reddy: చాదర్‌ఘాట్‌లో దొంగలను పట్టుకునే ప్రయత్నంలో గాయపడిన డీసీపీ చైతన్యకుమార్ ధైర్యసాహసాలను తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి అభినందించారు. విధి నిర్వహణలో తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా చూపిన ధైర్యం ప్రశంసనీయం అని ఆయన పేర్కొన్నారు.
డీసీపీ చైతన్యకుమార్, ఆయన గన్‌మ్యాన్ గాయపడిన ఘటనపై ఆదివారం డీజీపీ శివధర్‌రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్‌తో కలిసి సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిని సందర్శించారు. అక్కడ చికిత్స పొందుతున్న డీసీపీ ఆరోగ్య పరిస్థితిని వైద్యుల వద్ద తెలుసుకున్నారు.
తరువాత మీడియాతో మాట్లాడుతూ డీజీపీ శివధర్‌రెడ్డి, “డీసీపీ చైతన్యకుమార్ ఆరోగ్యం స్థిరంగా ఉంది. సోమవారం ఆయనను డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది. ఆయన ఒక ఆదర్శవంతమైన అధికారి. దొంగ చేతిలో కత్తి ఉందని తెలిసినా వెనుకడుగు వేయకుండా ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఆయనతో పాటు గన్‌మ్యాన్ చూపిన చొరవ, ధైర్యం కూడా ప్రశంసనీయమైనవి,” అని అన్నారు.
చాదర్‌ఘాట్ ప్రాంతంలో సెల్‌ఫోన్ దొంగతనాలకు పాల్పడుతున్న ఒమర్ అన్సారీ అనే నిందితుడిని పట్టుకోవడానికి డీసీపీ స్వయంగా రంగంలోకి దిగారు. ఆ సమయంలో ఆ నిందితుడు కత్తితో దాడి చేయడానికి ప్రయత్నించగా, ఆత్మరక్షణ కోసం డీసీపీ కాల్పులు జరపడం జరిగింది. ఈ ఘటనలో నిందితుడు గాయపడగా, డీసీపీ చైతన్యకుమార్, ఆయన గన్‌మ్యాన్ స్వల్పంగా గాయపడ్డారు.
గాయపడిన దొంగ ఒమర్ అన్సారీకి కూడా చికిత్స జరుగుతోందని, ప్రస్తుతం అతని పరిస్థితి మెరుగ్గా ఉందని డీజీపీ తెలిపారు. చైతన్యకుమార్ వంటి నిబద్ధత గల అధికారులు ఉన్నందువల్లే సమాజంలో భద్రతాభావం పెరుగుతోందని, పోలీస్ శాఖలో వారికి స్ఫూర్తి ప్రదాతలుగా నిలుస్తారని ఆయన అభిప్రాయపడ్డారు.

