Shikha Goyal: తెలంగాణ సైబర్ సెక్యూరిటీ డైరెక్టర్ శిఖా గోయల్ సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా నేరగాళ్లు శుభాకాంక్షలు, గిఫ్ట్‌లు అంటూ మోసపుచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, అందువల్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఆమె పేర్కొన్న వివరాల ప్రకారం, ఫేక్ షాపింగ్ ఆఫర్లు, పండుగ డిస్కౌంట్లు, నకిలీ వెబ్‌సైట్ల ద్వారా భారీ తగ్గింపు చూపించి మోసాలు జరుగుతున్నాయి. అలాగే, గిఫ్ట్ కార్డు మోసాలు, నకిలీ ఈ-వ్యాలెట్లు, చెల్లింపుల కోసం నకిలీ యాప్‌లు, క్యూఆర్ కోడ్‌లను ఉపయోగించి ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు.
గత కొద్దికాలంగా సోషల్ మీడియా, వాట్సాప్ ద్వారా మోసాల సంఖ్య పెరుగుతోందని ఆమె వివరించారు. పండుగ సందర్భంగా ప్రయాణ టిక్కెట్లు, గిఫ్టులు, షాపింగ్ ఆఫర్లను చూసి గుడ్డిగా నమ్మి మోసపోవద్దని, వాటిని కేవలం అధికారిక ప్లాట్‌ఫాంల ద్వారానే కొనుగోలు చేయాలని సూచించారు.
ఎవరైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 నెంబర్‌కు కాల్ చేయాలని లేదా cybercrime.gov.in వెబ్‌సైట్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు.

