Sheetal Devi: భారత పారా ఆర్చర్ శీతల్ దేవి మరోసారి గ్లోబల్ వేదికపై భారత త్రివర్ణ పతాకాన్ని ఎగరేసింది. దక్షిణ కొరియాలోని గ్వాంగ్‌జూలో జరిగిన పారా ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో ఆమె వ్యక్తిగత విభాగంలో బంగారు పతకాన్ని కైవసం చేసుకోవడంతో పాటు, ఈ టోర్నమెంట్‌లో మొత్తం మూడు పతకాలు గెలుచుకుంది.
స్వర్ణాన్ని ఖాయం చేసిన పర్ఫెక్ట్ షాట్
మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగం ఫైనల్‌లో శీతల్ దేవి టర్కీ స్టార్, ప్రపంచ నంబర్ 1 ఒజ్నూర్ క్యూర్ గిర్డిని 146-143 తేడాతో ఓడించి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. మొదటి ఎండ్‌లో 29-29తో సమంగా నిలిచిన తర్వాత, రెండో ఎండ్‌లో మూడు పర్ఫెక్ట్ 10లతో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. చివరి ఎండ్‌లో కూడా మూడు బాణాలను పర్ఫెక్ట్‌గా సంధించి (30 పాయింట్లు) విజయం ఖాయం చేసింది. 2023లో పిల్‌సెన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో గిర్డి చేతిలో స్వల్ప తేడాతో ఓడిన శీతల్, ఈసారి ప్రతీకారం తీర్చుకోవడం విశేషం.
సెమీఫైనల్‌లో అద్భుత ప్రదర్శన
జమ్మూ కాశ్మీర్‌కు చెందిన ఈ 18 ఏళ్ల ఆర్చర్ సెమీఫైనల్‌లో గ్రేట్ బ్రిటన్‌కు చెందిన జోడీ గ్రిన్‌హామ్‌పై 145-140 తేడాతో గెలిచి ఫైనల్‌లో అడుగుపెట్టింది. చేతులు లేని ఏకైక ఆర్చర్‌గా తన కాళ్లు, గడ్డాన్ని ఉపయోగించి బాణాలను సంధించే శీతల్ పట్టుదల, క్రమశిక్షణ అందరికీ ప్రేరణగా నిలుస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Asia Cup 2025: పాకిస్థాన్ టీమ్ మొత్తానికి మొగుడు.. ఆ ఒకే ఒక ఆటగాడు
టీమ్ ఈవెంట్లలో రజతం, కాంస్యం
వ్యక్తిగత విభాగంలో బంగారం గెలుచుకున్న శీతల్, జట్టు ఈవెంట్లలోనూ మెరిసింది.
-
మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్: తోమన్ కుమార్‌తో జతకట్టి బ్రిటన్ జట్టును ఓడించి కాంస్యం కైవసం చేసుకుంది.
-
మహిళల ఓపెన్ టీమ్ ఈవెంట్: సరితతో కలిసి ఫైనల్‌లో బలమైన టర్కీ జట్టును ఎదుర్కొని 148-152 తేడాతో ఓడిపోవడంతో రజతంతో సరిపెట్టుకుంది.
మొదటి ఎండ్‌లో భారత్ ఆధిక్యంలోకి వచ్చినా, తర్వాతి ఎండ్లలో టర్కీ ఆర్చర్లు పుంజుకుని మ్యాచ్‌ను తమ వైపు తిప్పుకున్నారు. అయినప్పటికీ శీతల్ ప్రదర్శనతో భారత్ పతకాల పట్టికలో మెరుపు జోడించింది.
పట్టుదలకే గుర్తింపు
ఈ ఛాంపియన్‌షిప్‌లో శీతల్ దేవి సాధించిన మూడు పతకాలు, స్వర్ణం, రజతం, కాంస్యం, ఆమె అసాధారణ ప్రతిభకు నిదర్శనం. జీవితంలోని సవాళ్లను లెక్క చేయకుండా కాళ్లతోనే ప్రపంచ వేదికపై బాణాలను సంధించి విజేతగా నిలవడం ఆమె గాథను మరింత గొప్పదనం చేస్తోంది.