Cheating Lady: మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో సంచలనం సృష్టించిన ఒక షాకింగ్ ఘటనలో, “నిత్య పెళ్లికూతురు”గా పేరుపొందిన సమీరా ఫాతిమా అనే మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఎనిమిది మంది పురుషులను వివాహం చేసుకుని, వారి నుండి లక్షల రూపాయలు దోపిడీ చేసినట్లు ఆమెపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఆమె ప్రధానంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు , మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్‌ల ద్వారా విడాకులు తీసుకున్న లేదా ఒంటరిగా ఉన్న పురుషులను లక్ష్యంగా చేసుకునేది. తాను వితంతువునని లేదా విడాకులు తీసుకున్న ఒంటరి తల్లిని అని చెప్పుకుంటూ, బాధితులతో భావోద్వేగ సంబంధాన్ని ఏర్పరుచుకునేది.
వారి నమ్మకాన్ని చూరగొన్న తర్వాత, రిజిస్టర్డ్ వివాహానికి ఒప్పించేది. వివాహం జరిగిన కొద్ది రోజులకే ఆమె తన నిజస్వరూపాన్ని బయటపెట్టేది. భర్తలను మానసికంగా వేధించడం, రహస్య సంభాషణలను రికార్డు చేసి బ్లాక్‌మెయిల్ చేయడం, లేదా అక్రమ సంబంధాలు వంటి తప్పుడు ఆరోపణలతో కేసులు పెడతానని బెదిరించి లక్షల రూపాయలు వసూలు చేసేది. నాగ్‌పూర్ పోలీసులు కొన్ని నెలలుగా ఆమె కోసం గాలిస్తున్నారు. ఆమె చివరి భర్త, గులామ్ పఠాన్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు వల పన్ని సమీరా ఫాతిమాను అరెస్టు చేశారు. సివిల్ లైన్స్ ప్రాంతంలోని డాలీ కీ టప్రీ వద్ద టీ తాగుతుండగా ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Madhya Pradesh: ఆన్‌లైన్ గేమ్‌లో డబ్బులు పోగొట్టుకున్న 13 ఏళ్ల బాలుడు.. భయంతో ఏంచేశాడో తెలుసా?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సమీరా ఫాతిమా గతంలో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేసినట్లు తెలుస్తోంది. గత 15 సంవత్సరాలుగా ఆమె ఈ రకమైన మోసాలకు పాల్పడి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. ఆమెకు 12 ఏళ్ల ఒక సంతానం ఉండగా, ఇటీవల మరొక బిడ్డకు జన్మనిచ్చినట్లు సమాచారం. ఈ సంఘటన నాగ్‌పూర్‌తో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సమీరా ఫాతిమా చట్టబద్ధంగా ఇప్పటికీ తన ఎనిమిది మంది భర్తలకు భార్యగానే ఉందని, వారి నుండి ఎటువంటి విడాకులు తీసుకోలేదని కూడా తెలిసింది. దీనిపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.