Shashi Tharoor: కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో మోదీ జరిపిన చర్చలు భారత్‌కు ఆశాజనకంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడితో జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో మోదీ హుందాగా ప్రవర్తించారని, దీని వల్ల దేశానికి ప్రయోజనం కలుగుతుందని ప్రశంసించారు.
అలాగే, దేశం ఎదుర్కొంటున్న పలు కీలక సమస్యలు త్వరలో పరిష్కారమవుతాయని శశి థరూర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యంగా వాణిజ్య సంబంధాల్లో భారత్ మేలు పొందేలా ప్రధాని ప్రయత్నాలు కొనసాగిస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.
అమెరికా భారతీయ ఉత్పత్తులపై అధిక టారిఫ్‌లు విధిస్తుండటంపై కూడా శశి థరూర్ స్పందించారు. అమెరికా టారిఫ్‌లు పెంచడం మన ఎగుమతులపై ప్రభావం చూపిస్తుందని, తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఇతర ఉత్పత్తులపై కూడా దీని ప్రతికూల ప్రభావం పడొచ్చని ఆయన హెచ్చరించారు.
అక్రమ వలసల అంశంపై కూడా ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. చట్టవిరుద్ధంగా అమెరికాలో నివసిస్తున్న భారతీయులను స్వదేశానికి తీసుకురావాలని ఆయన స్పష్టం చేశారు. ఏ దేశమైనా అక్రమ వలసదారులకు ఆశ్రయం ఇవ్వకూడదని, ఇది ప్రపంచవ్యాప్తంగా అందరికీ వర్తించే సూత్రమని మోదీ పేర్కొన్నారు. చట్ట విరుద్ధంగా ప్రవేశించిన భారతీయులు స్వదేశానికి తిరిగి రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.