Sharwanand

Sharwanand: బాలకృష్ణ ఫోన్ చేసి నా పరువు నిలబెట్టావ్ శర్వా అన్నారు

Sharwanand: ఈ సంక్రాంతికి సైలెంట్‌గా వచ్చి పెద్ద హిట్ కొట్టారు శర్వానంద్. నాలుగు భారీ సినిమాల మధ్యలో ఐదో సినిమాగా  ‘నారీ నారీ నడుమ మురారి’తో వచ్చిన శర్వానంద్, విడుదలైన ఐదు రోజుల్లోనే సినిమా ‘బ్రేక్ ఈవెన్’ సాధించడం విశేషం. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఇంటర్వ్యూలో ఆయన పాల్గొని రామ్ చరణ్, బాలకృష్ణ, తన వెయిట్ లాస్ మరియు ‘బైకర్’ సినిమా వాయిదా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

“గత కొన్ని ఏళ్ల నుండి నేను చేసిన సినిమాల్లోని పాత్రలకు ఒకదానికొకటి సంబంధం లేకపోయినా, లుక్స్ పరంగా మాత్రం అన్నీ ఒకేలా ఉన్నాయి. నేను కొంచెం లావుగా ఉండటం, సినిమాలో నన్ను నేను చూసుకున్నప్పుడు నచ్చకపోవడంతో సన్నబడాలని నిర్ణయించుకున్నాను. ‘జాను’ సినిమా తర్వాత ఈ నిర్ణయంపై గట్టిగా నిలబడ్డాను. అందులో భాగంగానే ఎక్సర్సైజులు, యోగా మరియు డైట్ చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అయ్యి బరువు తగ్గాను. అందుకే నా లుక్స్, స్టైలింగ్ ఇప్పుడు అందరికీ నచ్చుతున్నాయి” అని చెప్పుకొచ్చారు.

మార్కెట్ గురించి మాట్లాడుతూ.. “అందరిలా సినిమా సినిమాకీ మార్కెట్ పెంచుకోవాలని నేను సినిమాలు చేయను. సినిమా హిట్ అయితే మనకే తెలియకుండా మార్కెట్ పెరుగుతుంది. తదుపరి సంపత్ నందితో చేస్తున్న ‘భోగి’ సినిమాతో నా మార్కెట్ పెరుగుతుందని అనుకుంటున్నాను” అన్నారు.

ఇది కూడా చదవండి: Chandrababu Naidu: దావోస్‌లో ఇజ్రాయెల్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ.. అమరావతిపై కీలక చర్చలు

వచ్చే సంక్రాంతికి కూడా తాను మళ్ళీ వస్తున్నానని, ఈసారి మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో శ్రీను వైట్ల దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్లు ఇప్పటికే సక్సెస్ మీట్ లో ప్రకటించారు. అయితే ఈ సినిమాపై సోషల్ మీడియాలో వస్తున్న నెగిటివిటీపై స్పందిస్తూ.. “ఫ్లాప్ డైరెక్టర్ తో ఈ సమయంలో సినిమా ఎందుకు చేస్తున్నారు? అని కొందరు అంటున్నారు. కానీ ‘నారీ నారీ నడుమ మురారి’ హిట్ అవ్వడానికి ముందు నాకు కూడా 6-7 ఫ్లాపులు వచ్చిన విషయం మర్చిపోతున్నారు” అని బదులిచ్చారు.

ఇక సినిమా ఫలితంపై స్పందిస్తూ.. “సినిమాకు హిట్ టాక్ వచ్చిన వెంటనే బాలకృష్ణ గారు నాకు కాల్ చేసి ‘నా పరువు నిలబెట్టావ్ శర్వా’ అన్నారు. రామ్ చరణ్ ఇంకా సినిమా చూడలేదు, తను చూసిన తర్వాత ఇచ్చే అభిప్రాయం కోసం నేను ఎదురుచూస్తున్నాను” అని తెలిపారు.

డిసెంబర్ లో విడుదల కావాల్సిన ‘బైకర్’ సినిమా వాయిదా పడడానికి కారణం అందులో ఉన్న VFX వర్క్ ఆలస్యం అవ్వడమేనని చెప్పారు. ఈ సినిమాలో తాను తండ్రి, కొడుకుగా రెండు పాత్రలు చేస్తున్నట్లు, సీనియర్ నటుడు రాజశేఖర్ ఒక ముఖ్యపాత్రలో కనిపించనున్నారని వెల్లడించారు.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *