Sharmila letter to Jagan: అందరికీ శకునం చెప్పే బల్లి తాను పోయి కుడితిలో పడిందని ఒక సామెత. ఇది అక్షరాలా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి.. వైసీపీ పార్టీకీ సరిగ్గా సరిపోతుంది. రాజకీయాల్లో అవతలి వారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి.. అబద్ధాల్ని నిజాలు చేయడానికి సోషల్ మీడియా సాక్షిగా బూతు పురాణాలు వల్లెవేసే వైసీపీ నాయకులు ఇప్పుడు ఏమి మాట్లాడతారో చూడాలి. నారా లోకేష్ ను రకరకాలుగా మాట్లాడిన వ్యక్తులు.. ఇప్పుడు తమ తల ఎక్కడ పెట్టుకుంటారో తెలుసుకోవాలి. ఎందుకు ఇలా అంటున్నానంటే, గతంలో లోకేష్ గురించి ఎన్నో అవాకులు చెవాకులు పేలారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కానీ, కుటుంబం అంటే.. పెద్దలంటే ఎలాంటి గౌరవం ఇవ్వాలో.. మర్యాదగా ఎలా మసలుకోవాలి లోకేష్ ను చూసి నేర్చుకోవాలి. తన పాదయాత్ర సమయంలో తల్లి దండ్రుల కాళ్లకు నమస్కరించి వారి ఆశీర్వాదం తీసుకుని.. కుటుంబం మొత్తాన్ని పలకరించి పాదయాత్ర మొదలు పెట్టారు లోకేష్. కానీ, ఎప్పుడైనా ఒక్కసారైనా.. ఒక్క సందర్భంలోనైనా జగన్ తన తల్లి పాదాలను మొక్కడం చూశామా? పైగా తల్లిని, చెల్లిని ఆస్తి కోసం బజారుకు లాగుతున్న పరిస్థితి ఇప్పుడు దాపురించింది.
Sharmila letter to Jagan: అన్నా.. ఇలా చేశావేమిటి? అంటూ సొంత చెల్లెలు షర్మిల వాపోతోంది. అన్నా.. నా తండ్రి మరణం వెనుక ఉన్న వాళ్ళని వెనకేసుకువస్తున్నావేమిటి? అంటూ చిన్నాన్న బిడ్డ ఆవేదనతో అడుగుతోంది. పెద్దాయన.. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆదేశాలను పక్కన పెట్టి ఇదేమి పనిరా బాబూ అని తల్లి విజయ రాజశేఖర్ రెడ్డి కుమిలిపోతోంది. సొంత కుటుంబాన్ని ఆస్తుల కోసం వీధిన పడేసిన జగన్మోహన్ రెడ్డి ప్రజలకు మేలు ఏమి చేస్తాడు? అంటూ ప్రశ్నిస్తోంది జనావళి.
Sharmila letter to Jagan: ఒకేరోజు రెండు సంచలనాలు.. తన చెల్లెలు వైఎస్ షర్మిల, తల్లి వైఎస్ విజయ రాజశేఖర్ రెడ్డిలపై సరస్వతి పవర్ కంపెనీ షేర్ల విషయంలో కోర్టులో కేసు వేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు దేశమంతా ఉలిక్కిపడింది. జగన్ స్థాయికి ఒక కంపెనీలో షేర్లు పెద్దగా ఇష్యు కాదు. కానీ, ఇలా ఎందుకు చేశారు అనే చర్చ మొదలైంది. ఇదిలా ఉండగానే ఇంకో బాంబును టీడీపీ పేల్చింది. జగన్మోహన్ రెడ్డికి తన చెల్లెలు షర్మిల ఆవేదనతో రాసిన లేఖ అది. చాలాకాలంగా జగన్-షర్మిల మధ్య ఉన్న ఆస్తి తగాదాలు అనే వదంతులను నిజం చేసిన లేఖ అది. జగన్మోహన్ రెడ్డి నిజస్వరూపాన్ని ప్రజల ముందు నిలబెట్టిన లేఖ అది. అన్నాచెల్లెళ్ల బంధాన్ని ఆస్తుల కోసం ఎలా తుంచుకునే ప్రయత్నం చేస్తున్నారో వెల్లడించిన లేఖ అది. ఒక హత్య కేసులో నిందితునిగా ఉన్న వ్యక్తిని రక్షించడం కోసం సొంత చెల్లి.. కన్న తల్లిని కట్టడి చేయాలని చేసిన ప్రయత్నాన్ని విస్పష్టంగా వినిపించిన లేఖ అది. ఆలి బెల్లమాయె తల్లి అల్లమాయె అనే సామెత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సరిగ్గా అతుకుతుంది అని తేల్చిన లేఖ అది. వెరసి ఒక్క లేఖ.. జగన్మోహన్ రెడ్డిలోని ఎన్నో పైశాచిక కోణాలను వెలికి తీసి చూపించింది.
Sharmila letter to Jagan: సరే ఇదంతా కుటుంబ వ్యవహారం అని జగన్మోహన్ రెడ్డి వాదించవచ్చు. లేదా ఇది టీడీపీ కుట్ర. మా కుటుంబాన్ని విడదీయడం కోసం నా చెల్లిని, తల్లిని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు అని ప్రెస్ మీట్ పెట్టి ఆక్రోశించవచ్చు. కానీ, లేఖలోని అంశాల విషయంలో మాత్రం జగన్ కానీ ఆయన ఆదేశాలతో ఆనాడు చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి, లోకేష్, పవన్ కళ్యాణ్, ఆయన తల్లి ఇలా ఎందరినో దూషించిన వైసీపీ నాయకుల నోళ్లు కానీ ఇప్పుడు ఏమి చెబుతాయి? నలుగురు నవ్విపోయినా మాకేంటి అనే తీరుతో జగన్మోహన్ రెడ్డి అండ్ కో చెలరేగిపోతున్నారు.
Sharmila letter to Jagan: కుటుంబ బంధాలకు విలువ ఇవ్వని నాయకులా ఏపీలోని పరిస్థితులపై ప్రశ్నిస్తారు. సొంత ఇంటి మహిళలను బజారు కీడ్చిన నాయకుడా.. రాష్ట్రంలోని మహిళను.. నా చెల్లెళ్ళు.. అమ్మలు అంటూ ఉఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చేది అని ప్రజలు అనుకుంటున్నారు. అధికారం కోసం రాజకీయాలు చేయడం.. అధికారం కోసం పాదయాత్రలు చేయడం.. అధికారం కోసం తల్లిని, చెల్లిని రాష్ట్రం అంతా తిప్పడం.. ఇప్పుడు అవసరం తీరాకా వారిని పక్కన పెట్టేయడమే కాకుండా.. కుటుంబ పెద్దగా తండ్రి ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసి ప్రజలంతా ముక్కున వేలేసుకుంటున్నారు.