Sharmila: వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గురువారం విలేకరుల సమావేశంలో తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మధ్య హాట్‌లైన్ ఉందన్న జగన్ వ్యాఖ్యలను ఖండించిన ఆమె, అసలైన హాట్‌లైన్ మాత్రం జగన్‌కు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు మధ్యే ఉందని ప్రతిదాడి చేశారు.
“మోదీకి దత్తపుత్రుడిగా మారి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారు. అసెంబ్లీలో ప్రజల సమస్యలపై మాట్లాడే ధైర్యం జగన్‌కు లేదు” అని షర్మిల ఆరోపించారు. గత ఐదేళ్ల పాలనలో జగన్ పూర్తిగా బీజేపీకి లోబడిపోయారని విమర్శించారు.
బీజేపీతో అక్రమ పొత్తు
“ప్రత్యేక హోదా తెస్తానని మాటిచ్చి అధికారంలోకి వచ్చిన మీరు, ఆ తర్వాత మోదీకి ఎన్నిసార్లు సాగిలపడ్డారు. బీజేపీ ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకు బేషరతుగా మద్దతు ఇచ్చారు. గంగవరం పోర్టు వంటి విలువైన ప్రాజెక్టులను మోదీ మనుషులకు అప్పగించారు. బీజేపీ నేతలకు ఎంపీ పదవులు కూడా ఇచ్చారు. ఇది అక్రమ పొత్తా? లేక రాజకీయ వ్యభిచారమా?” అని ప్రశ్నించారు.
రాజశేఖర్‌రెడ్డి సిద్ధాంతాలకు విరుద్ధం
దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి బీజేపీని మతతత్వ పార్టీగా అభివర్ణించి ఎప్పుడూ వ్యతిరేకించారని గుర్తుచేసిన షర్మిల, ఆయన కొడుకు జగన్ మాత్రం అదే బీజేపీకి దత్తపుత్రుడిగా మారడం సిగ్గుచేటని అన్నారు. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణికం ఠాగూర్‌పై జగన్ చేసిన వ్యాఖ్యలు సంస్కారహీనతకు నిదర్శనమని మండిపడ్డారు.
లిక్కర్ స్కామ్‌పై సమాధానం చెప్పాలి
“మోదీకి వ్యతిరేకంగా పోరాడే ధైర్యం మీకుందా?” అని మాణికం ఠాగూర్ విసిరిన సవాలకు జగన్ ఇప్పటికీ సమాధానం ఇవ్వలేదని షర్మిల ఎద్దేవా చేశారు. లిక్కర్ స్కామ్‌పై అసెంబ్లీలో జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. నాసిరకం బ్రాండ్లకు ఎందుకు అనుమతిచ్చారో, నగదు రూపంలోనే అమ్మకాలు జరిపారో వివరించాలన్నారు.
“ప్రజల కోసం అసెంబ్లీలో, దేశం కోసం పార్లమెంటులో పోరాడలేని మీరు, మీదొక పార్టీ, మీరొక నాయకుడు అన్నట్టు ప్రవర్తించడం తగదు” అని షర్మిల ఘాటుగా వ్యాఖ్యానించారు.