Sharmila: విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘ఆపరేషన్ సైలెంట్ కిల్లింగ్’ చేపట్టారని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. లక్షల కోట్ల విలువైన స్టీల్ ప్లాంట్ భూములను కైవసం చేసుకోవడానికే ఈ కుట్ర జరుగుతోందని ఆమె తీవ్ర విమర్శలు చేశారు. ఎంబీ భవన్‌లో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో మాట్లాడిన షర్మిల, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై బీజేపీ నాటకాలు ఆడుతోందని, రాష్ట్రంలోని 25 మంది ఎంపీలు కేంద్రానికి వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు.
2021లో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు, టీడీపీ ఎంపీలు రాజీనామా చేసేందుకు సిద్ధమని లేఖ రాసి, వాజ్‌పేయి కాలంలో తాను ప్రైవేటీకరణను అడ్డుకున్నానని గొప్పలు చెప్పుకున్నప్పటికీ ఇప్పుడు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. టీడీపీ, జనసేన బీజేపీతో బహిరంగంగా పొత్తు పెట్టుకున్నాయని, వైసీపీ మాత్రం రహస్యంగా ఒప్పందం చేసుకుందని ఆమె దుయ్యబట్టారు. విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల విలువ రూ.4–5 లక్షల కోట్లు ఉంటుందని, దాదాపు 20 వేల ఎకరాలను దోచుకోవడానికే మోదీ ఈ కుట్ర చేస్తున్నారని, అందుకే రా మెటీరియల్, క్యాప్టివ్ మైన్స్, లాజిస్టిక్స్ ఇవ్వడంలేదని షర్మిల ఆరోపించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో పార్లమెంట్‌లో రాష్ట్ర ఎంపీలు ఒక్కరూ గొంతు విప్పలేదని, పోలవరం విషయంలో కూడా ఐకమత్యం కనిపించలేదని ఆమె విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంపీలు ఏకగ్రీవంగా పోరాడాలని డిమాండ్ చేస్తూ, విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కాంగ్రెస్ పార్టీ అలుపెరగని పోరాటం చేస్తుందని షర్మిల స్పష్టం చేశారు.