Sharmila: మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం (MGNREGA)లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉపాధి హామీ చట్టం దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఆమె గుర్తు చేశారు.
గత 20 ఏళ్లలో ఉపాధి హామీ పథకం ద్వారా రాష్ట్రానికి లక్షల కోట్ల రూపాయల నిధులు వచ్చాయని, కోట్లాది పేదలకు ఈ పథకం జీవనాధారంగా మారిందని షర్మిల తెలిపారు. అయితే, మోదీ ప్రభుత్వం ‘వీబీ జీ రామ్ జీ’ పేరుతో తీసుకొచ్చిన కొత్త చట్టం ద్వారా ఈ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన ఉపాధి చట్టానికి, బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని షర్మిల ఘాటుగా వ్యాఖ్యానించారు. ఉపాధిని హక్కుగా కాకుండా కేంద్రం దయాదాక్షిణ్యాలపై ఆధారపడేలా మార్చడం అన్యాయమని మండిపడ్డారు.
గ్రామసభలకు ఉండాల్సిన నిర్ణయాధికారాన్ని ఢిల్లీ చేతుల్లో పెట్టారని, 100 రోజుల పని హామీని కుదించి, నిధుల భారాన్ని రాష్ట్రాలపై మోపడం పేదలపై దాడి చేసినట్లేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాదికి కేవలం 60 రోజుల పనికే పరిమితం చేయడం, ఎంపిక చేసిన ప్రాంతాల్లోనే పనులు కల్పించడం వల్ల గ్రామీణ పేదలు తీవ్రంగా నష్టపోతారని అన్నారు.
కార్పొరేట్ శక్తులు, కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేందుకే కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త విధానాన్ని తీసుకువచ్చిందని షర్మిల ఆరోపించారు. ఈ ‘నల్లచట్టాన్ని’ వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ అంశంపై ఏపీసీసీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆమె ప్రకటించారు. ప్రజా సంఘాలు, రైతు సంఘాలు, ఇతర రాజకీయ పార్టీలను కలుపుకుని ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
