Shah Rukh Khan: తాజాగా కురిసిన భారీ వర్షాలు పంజాబ్‌ను అతలాకుతలం చేశాయి. వరదలతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయి, అనేక కుటుంబాలు తీవ్ర నష్టాన్ని చవిచూశాయి. పంటలు మునిగిపోగా, పశువులు చనిపోయాయి. వేలాది మంది ఇళ్లను వదిలి వేరే ప్రదేశాల్లో ఆశ్రయం పొందుతున్నారు. ఈ కష్టకాలంలో బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ ముందుకు వచ్చి తన పెద్ద మనసును మరోసారి చాటుకున్నారు.
షారుఖ్ స్థాపించిన మీర్ ఫౌండేషన్ పంజాబ్ వరద బాధితులకు సహాయంగా అవసరమైన వస్తువులను పంపిణీ చేస్తోంది. స్థానిక స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేస్తున్న మీర్ ఫౌండేషన్, అమృత్సర్, పాటియాలా, ఫాజిల్కా, ఫిరోజ్‌పూర్ జిల్లాల్లోని 1,500 కుటుంబాలకు అవసరమైన సహాయ కిట్లను అందిస్తోంది.
ఇది కూడా చదవండి: Telusu Kada: యువతను ఆకట్టుకుంటున్న ‘తెలుసు కదా’ టీజర్
ఈ కిట్లలో మందులు, ఆహార పదార్థాలు, పరిశుభ్రత సాధనాలు, దోమతెరలు, టార్పాలిన్ షీట్లు, మడతపెట్టే పడకలు, కాటన్ పరుపులు వంటి అత్యవసర వస్తువులు ఉన్నాయి. బాధితుల తక్షణ ఆరోగ్యం, భద్రత, ఆశ్రయం వంటి అవసరాలు తీరేలా చర్యలు తీసుకుంటోంది సంస్థ.
ఈ సందర్భంగా షారుఖ్ ఖాన్ ట్వీట్ చేస్తూ – “ఈ కష్ట సమయంలో దేవుడు మీ అందరికీ తోడుగా ఉంటాడు” అని బాధితులకు ధైర్యం చెప్పారు.
పంజాబ్ ప్రజలు ఎదుర్కొంటున్న ఈ క్లిష్ట పరిస్థితుల్లో షారుఖ్ సహాయం ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తోందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

