Rahul Mamkootathil: కేరళ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన లైంగిక ఆరోపణల వ్యవహారంలో సస్పెండ్ అయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్ మమ్కూటథిల్పై ఒక మహిళ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేసింది. గతంలో పలువురు మహిళలు, ఒక ట్రాన్స్‌జెండర్ మహిళ బహిరంగంగా ఆరోపణలు చేసినప్పటికీ, పోలీసులకు ఫిర్యాదు చేయడం ఇదే తొలిసారి. పాలక్కాడ్ నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన రాహుల్ మమ్కూటథిల్పై లైంగిక వేధింపులు, బెదిరింపులకు పాల్పడ్డాడంటూ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును క్రైమ్ బ్రాంచ్‌కు అప్పగించారు. గతంలో ఒక మలయాళ నటి, రచయిత్రి సహా పలువురు మహిళలు ఎమ్మెల్యే రాహుల్ తమకు అభ్యంతరకర సందేశాలు పంపారని, హోటల్‌కు రమ్మని బలవంతం చేశారని ఆరోపించారు.
Also Read: Amaravati: అమరావతిలో 15 బ్యాంకులకు శంకుస్థాపన చేయనున్న నిర్మలా సీతారామన్
ఒక మహిళను గర్భస్రావం చేయించుకోవాలని బెదిరించిన ఆడియో క్లిప్ కూడా వైరల్ కావడంతో ఈ వివాదం మరింత తీవ్రమైంది. అవంతిక అనే ట్రాన్స్‌జెండర్ మహిళ కూడా రాహుల్ తమను అత్యాచారం చేస్తానని బెదిరించాడని ఆరోపించింది.ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే రాహుల్ మమ్కూటథిల్ను యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి తొలగించింది. అనంతరం, వివాదం తీవ్రత దృష్ట్యా ఆయనను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి ఆరు నెలల పాటు సస్పెండ్ చేసింది. అయితే, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని మాత్రం కోరలేదు. ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు, బాధితులు ఫిర్యాదు చేయడానికి వెనుకాడవద్దని, వారికి పూర్తి రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. రాజకీయంగా, సామాజికంగా కలకలం సృష్టిస్తున్న ఈ కేసు దర్యాప్తును పోలీసులు మరింత వేగవంతం చేశారు.
